రోజూ 10 లక్షల కరోనా పరీక్షలు: మోదీ
ABN , First Publish Date - 2020-07-28T01:29:23+05:30 IST
దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 10 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాని..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 10 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కరోనాపై పోరులో భారత్ ప్రపంచం దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని, సకాలంలో చేపట్టిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. మరణాలు కూడా పెద్ద దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువని అన్నారు. రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉందన్నారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కరోనా పరీక్షా కేంద్రాలను నొయిడా, ముంబై, కోల్‌కతాలో ప్రధాని మోదీ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సోమవారంనాడు ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా కమ్ముకున్న కరోనా మహమ్మారిని దేశ ప్రజలు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారని ప్రశంసించారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన హైటెక్ పరీక్షా సౌకర్యాలతో కరోనాపై మన పోరాటం మరింత బలపడుతుందని చెప్పారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతాలు ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రాలని, లక్షలాది మంది యువకులు తమ కలలు పండిచుకుంటానని ఇక్కడకు వస్తుంటారని, ఇప్పుడు కరోనా వైరస్‌పై పోరాటంలో ఇవి మరింత పటిష్ట కేంద్రాలుగా నిలుస్తాయని చెప్పారు. ఈ మూడు కేంద్రాలతో రోజుకు మరో 10,000 కరీనా పరీక్షల సామర్థ్యం పెరుగుతుందని ప్రధాని చెప్పారు. ఈ మూడు హైటెక్స్ లాబ్స్ కేవలం కరోనా వైరస్ పరీక్షలకే పరిమితం కాదని, హెపటైటిస్ బి,సి, హెచ్ఐవీ, డెంగ్యూ తదితర పరీక్షలు కూడా నిర్వహిస్తాయని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పరీక్షా కేంద్రాలను ప్రధాని ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు.