కోవిడ్-19పై మీడియా అధిపతులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-03-23T21:24:14+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మీడియా అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్..

కోవిడ్-19పై మీడియా అధిపతులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ:  ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా అధిపతులతో మాట్లాడారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి ప్రకాశ్ జావడేకర్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్నాబ్ గోస్వామి, సుమితా ప్రకాశ్, రజత్ శర్మ సహా పలు మీడియా సంస్థలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.


ప్రధాని సూచనల మేరకు నిన్న దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించగా.. నేటి నుంచి పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పాటిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు సీరియస్‌గా తీసుకోకపోవడంపై ప్రధాని మోదీ ఇవాళ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికీ చాలామంది ప్రజలు లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ సూచనలను జాగ్రత్తగా పాటిస్తూ ప్రజలు తమను, తమ కుటుంబాలను కాపాడుకోవాలి. ఈ మేరకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను..’’ అని ప్రధాని ఇవాళ ట్వీట్ చేశారు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 415కు చేరుకున్నట్టు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. 


Updated Date - 2020-03-23T21:24:14+05:30 IST