దేశ భద్రతే మాకు అగ్ర ప్రాధాన్యం : ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-10-03T17:59:26+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన ‘అటల్ టన్నెల్’ ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా

దేశ భద్రతే మాకు అగ్ర ప్రాధాన్యం : ప్రధాని మోదీ

సిమ్లా : ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన ‘అటల్ టన్నెల్’ ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఈ టన్నెల్ పూర్తికావాలన్నది కేవలం అటల్ బిహారీ వాజ్‌పాయ్ కల మాత్రమే కాదని, హిమాచల్ ప్రదేశ్ ప్రజల కల కూడా అని ఆయన అన్నారు. ఇంత శక్తిమంతమైన, ముఖ్యమైన టన్నెల్ సరిహద్దుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠ పరుస్తుందని, కొత్త బలాన్ని చేకూరుస్తుందని ప్రకటించారు. కొత్త కొత్త సంస్కరణలను తేవడం ద్వారా సరికొత్త, అధునాత ఆయుధాలు దేశంలోనే తయారు చేసుకోడానికి వీలవుతుందని అన్నారు.


 


దేశ భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమని, అంతకంటే ముఖ్యమైన అంశం తమకు మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. అయితే రక్షణ రంగంలో రాజీపడ్డ ఘటనలను కూడా ప్రజలు చూశారని గత ప్రభుత్వాలపై మోదీ అన్యాపదేశంగా మండిపడ్డారు. సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ ఫలాలు కేవలం భద్రతా బలగాలకే అందవని, దేశంలోని సామాన్యులకు కూడా అందుతాయని ప్రకటించారు. చాలా కాలం తర్వాత మహా దళపతి బిపిన్ రావత్ కూడా మన వ్యవస్థలో భాగం అయ్యారని, భారత సైన్యానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సేకరించే విషయంలోనూ, ఉత్పత్తి చేసే విషయంలోనూ మంచి సమన్వయం ఏర్పడిందని మోదీ ప్రశంసించారు.


 ఈ టన్నెల్ ప్రారంభం ప్రపంచ స్థాయి సరిహద్దు కనెక్టివిటీకి ఓ ఉదాహరణగా నిలుస్తుందని ప్రకటించారు. సరిహద్దు మౌలిక సదుపాయాలను పటిష్ఠపరిచాలన్న డిమాండ్లు చాలా కాలంగానే ఉన్నాయని, అయితే... ప్రణాళిక దశలోనే ఆగిపోతున్నాయని, లేదా మధ్యలోనే ఆగిపోయాయని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్‌లోని ‘కోసీ మహాసేతు’ నిర్మాణాన్ని కూడా వేగవంతంగా పూర్తిచేసి.. జాతికి అంకితం చేశామని ఆయన గుర్తు చేశారు. చాలా తక్కువ వనరులున్నా సరే.. దేశ జవాన్లు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా వివిధ యూనివర్శిటీలు ఈ టన్నెల్‌ను ఓ ‘కేస్ స్టడీ’ గా అధ్యయనం చేయాలని అందుకు విదేశాంగ శాఖ ఓ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.


 అంతేకాకుండా ఈ టన్నెల్‌ను నిర్మించిన విధానం, చేసిన శ్రమను అధ్యయనం చేయడానికి వీలుగా ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని కేంద్ర విద్యాశాఖను కూడా మోదీ ఆదేశించారు. టన్నెల్‌ నిర్మాణం ప్రారంభించిన సమయంలో నిపుణులను అడిగితే... 2040 లో పూర్తవుతుందని నిపుణులు పేర్కొన్నారని, అయితే... కేవలం ఆరు సంవత్సరాల్లోనే దీనిని పూర్తి చేసి చూపించామని ఆయన పేర్కొన్నారు.


పెండింగ్‌లో ఉన్న మిగితా ప్రాజెక్టులను కూడా ఇదే తరహాలో త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రముఖమైన ‘దౌలత్ బేగ్ ఓల్దీ ఏయిర్ స్ట్రిప్’ 45 ఏళ్ల నుంచి మూసే ఉందని, దాని వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదని, అయితే దాని వెనకున్న దాగి వున్న ఒత్తిళ్లేందని ప్రశ్నించారు. అనుసంధానించే ప్రక్రియ అభివృద్ధి అన్న ప్రక్రియకు  నేరుగా సంబంధం ఉంటుందని, సరిహద్దు ప్రాంతంలో అనుసంధానించే ప్రక్రియ కూడా భద్రతతో ముడిపడి ఉంటుందని మోదీ తెలిపారు. 

Updated Date - 2020-10-03T17:59:26+05:30 IST