100వ కిసాన్ రైలుకు మోదీ పచ్చజెండా

ABN , First Publish Date - 2020-12-29T00:03:32+05:30 IST

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఈ కిసాన్ రైలు మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ వరకూ..

100వ కిసాన్ రైలుకు మోదీ పచ్చజెండా

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలుకు ఆదివారంనాడు పచ్చజెండా ఊపి  ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఈ కిసాన్ రైలు మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ వరకూ ప్రయాణిస్తుంది. దేశంలోని రైతులకు సాధికరత కల్పించే క్రమంలో ఇదో పెద్ద అడుగు అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయెల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


'దేశంలోని కోట్లాది మంది రైతులకు అభినందనలు తెలుపుతున్నాను. కోవిడ్ సవాళ్లు ఉన్నప్పటికీ గత నాలుగు నెలలుగా కిసాన్ రైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ వచ్చాం. ఇప్పుడు 100వ రైలు పట్టాలపైకి వచ్చింది' అని ప్రధాని తెలిపారు. రైతులకు సాధికారత కల్పించడం, వారి ఆదాయం పెంచడం లక్ష్యంగా కిసాన్ రైలు భారీ ముందడుగు అవుతుందని అభివర్ణించారు. కిసాన్ రైళ్లు దేశంలోని రైతులు, పంట ప్రాంతాలకు అనుసంధానంగా నిలుస్తాయని, 80 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులకు కిసాన్ రైళ్లతో కొండత శక్తి వస్తుందని చెప్పారు.


రైతులు 50-100 కిలోల సరుకును కూడా రైళ్లలో సుదూర మార్కెట్లకు పంపవచ్చని ప్రధాని చెప్పారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం టమోటాలు, ఉల్లి, బంగాళాదుంపల రవాణాపై 50 శాతం సబ్సిడీ ఇచ్చిందని గుర్తు చేశారు. పీఎం క్రిషి సంపద యోజన పథకం ద్వారా మెగా ఫుడ్ పార్కులు, కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్టక్చర్, ఆగ్రో-ప్రోసెసింగ్ క్లస్టర్‌‌ కింద 6,000కు పైగా ప్రాజెక్టులను ఆమోదించామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలకు రూ.10,000 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

Updated Date - 2020-12-29T00:03:32+05:30 IST