ఇక స్వదేశీ
ABN , First Publish Date - 2020-12-28T07:13:35+05:30 IST
మన దేశంలో తయారైన వస్తువులనే వాడాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. విదేశాల్లో తయారైన వస్తువులను వాడొద్దని కోరారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ దీన్ని కొత్త సంవత్సర తీర్మానంగా చేసుకోవాలన్నారు...

- విదేశీ వస్తువులను వినియోగించొద్దు
- కొత్త సంవత్సర తీర్మానంగా చేసుకోండి
- ఈసారి దేశం కోసం.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ పిలుపు
- 2021లో స్వదేశీ వస్తువులనే వాడతానన్న విశాఖవాసికి ప్రశంస
- మురళీ ప్రసాద్ రూపొందించిన ‘ఏబీసీ 2021’ చార్ట్ ప్రస్తావన
- ప్రజల్లో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి పెరిగింది.. ఆలోచనల్లో మార్పు
- అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తువులను తయారు చేయాలని పారిశ్రామిక వర్గాలకు సూచన
న్యూఢిల్లీ, డిసెంబరు 27: మన దేశంలో తయారైన వస్తువులనే వాడాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. విదేశాల్లో తయారైన వస్తువులను వాడొద్దని కోరారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ దీన్ని కొత్త సంవత్సర తీర్మానంగా చేసుకోవాలన్నారు. ఆదివారం ప్రధాని ‘మన్‌కీ బాత్’ (ఈ ఏడాదికి ఇదే చివరిది) రేడియో కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అంశాలపై తన మనసులోని భావాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా స్థానికంగానే ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయాలని దేశీయ తయారీదారులు, పారిశ్రామిక వేత్తలను ప్రధాని కోరారు. 2020లో మన సమాజంలో పెరిగిన ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తిని చూశామన్నారు.
‘‘స్థానిక వస్తువులనే వాడాలన్న పిలుపు (వోకల్ ఫర్ లోకల్)కు ప్రతి ఇంట్లోనూ విశేష స్పందన వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలి’’ అని దేశీయ తయారీదారులకు పిలుపునిచ్చారు. ఇళ్లలో వాడే వస్తువుల జాబితాను సిద్ధం చేసుకొని విదేశాల్లో తయారయ్యే వాటిని గుర్తించాలని, వాటి స్థానంలో ‘మేడిన్ ఇండియా’ వస్తువులను వినియోగించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా విశాఖపట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్ తయారు చేసిన ఏబీసీ చార్ట్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘‘వెంకట మురళీ ప్రసాద్ నాకో లేఖ రాశారు. ఆయనో వినూత్న ఆలోచనతో నా ముందుకు వచ్చారు. ‘నేను మీకు ఏబీసీ చార్ట్-2021 పంపుతున్నా’ అని లేఖలో తెలిపారు.
ఏబీసీ అంటే అర్థం ఏంటో నాకు తెలియలేదు. కానీ, లేఖతో పాటే చార్ట్‌ను కూడా పంపారు. అది చదివాక ఏబీసీ అంటే ‘ఆత్మనిర్భర్ భారత్ చార్ట్’ అని అర్థమైంది’’ అని ప్రధాని తెలిపారు. ఆయన తన ఇంట్లో రోజూ వాడే వస్తువుల జాబితాను రూపొందించారని, వాటిలో 2021 నుంచి భారత్‌లో తయారైన వాటినే ఎక్కువగా ఉపయోగించాలని తీర్మానించుకున్నట్లు తెలిపారని వెల్లడించారు. వెంకట మురళీ ప్రసాద్ చొరవను ప్రధాని ప్రశంసించారు. ‘‘ఏటా మీరంతా ఏదో ఒక తీర్మానం చేసుకుంటూనే ఉంటారు. ఈ సారి మాత్రం దేశం కోసం చేయండి. దేశీయ వస్తువులనే వినియోగిస్తామని తీర్మానించుకోండి’’ అని మోదీ చెప్పారు. ఇప్పటికే చాలా దుకాణదారులు బొమ్మలు వంటివి భారత్‌లోనే తయారయ్యాయని స్పష్టంగా చెబుతున్నారని, వినియోగదారులు కూడా మేడిన్ ఇండియా వస్తువులనే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇది ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన భారీ మార్పని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కశ్మీరీ కుంకుమపువ్వును ప్రస్తావించారు. దీన్ని అంతర్జాతీయంగా ప్రముఖ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రధాని ప్రస్తావించిన అంశాలు..
కొత్త సంవత్సరంలో దేశాన్ని ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ రహితంగా మార్చేందుకు తీర్మానం చేసుకోవాలి. సిక్కు మత గురువులు చార్ సాహిబ్‌జాదె, మాతా గుజ్రి, గురు తేజ్‌బహదూర్ జీ, గురు గోవింద్ సింగ్‌లను స్మరించుకోవాలి. వారి గొప్పతనం, త్యాగాలు ఎనలేనివి.
ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్న వేళ ఉపాధ్యాయులు సరికొత్త కోర్సు సామగ్రిని తయారు చేశారు. ఆ మెటీరియల్‌ను విద్యాశాఖ దీక్ష పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
‘హీలింగ్ హిమాలయాస్’ భేష్
హిమాలయాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న ప్రదీప్ సాంగ్వాన్‌ను మోదీ ప్రశంసించారు. హరియాణా పర్వతారోహకుడైన ప్రదీప్(35) నాలుగేళ్ల క్రితం ‘హీలింగ్ హిమాలయాస్’ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రదీప్, ఇతర వలంటీర్లు కలిసి హిమాలయాల్లో పర్యాటకులు వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారు. ప్రదీప్ సాంగ్వాన్ చేస్తున్న సేవ ఎందరికో స్ఫూర్తినిస్తోందని మోదీ అన్నారు.
