ఆర్కేకు మోదీ ఫోన్‌

ABN , First Publish Date - 2020-03-25T07:21:29+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ సమయంలో నిత్యావసరాలను ఇంటింటికీ తెచ్చుకోవడం కష్టమని, అవి సకాలంలో ప్రజలకు లభ్యమయ్యేలా ప్రభుత్వమే చొరవ చూపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’...

ఆర్కేకు మోదీ ఫోన్‌

జాతినుద్దేశించి ప్రసంగించిన వెంటనే ‘ఆంధ్రజ్యోతి’ అధినేతతో మాటామంతీ

కరోనా, లాక్‌డౌన్‌పై సూచనలు కోరిన ప్రధాని

లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాల లభ్యత కష్టం

అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే చూడాలి: ఆర్కే

అన్ని రాష్ట్రాలతో వెంటనే మాట్లాడతా: మోదీ


హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ సమయంలో నిత్యావసరాలను ఇంటింటికీ తెచ్చుకోవడం కష్టమని, అవి సకాలంలో ప్రజలకు లభ్యమయ్యేలా ప్రభుత్వమే చొరవ చూపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ సూచించారు. నిత్యావసరాల సరఫరా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని వివరించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అది ముగిసిన వెంటనే 8.40 గంటలకు రాధాకృష్ణకు ప్రధాన మంత్రి ఫోన్‌ చేశారు. నిజానికి, దేశంలో కరోనా ప్రభావం నేపథ్యంలో దేశంలోని 14 కేంద్రాల్లో ఉన్న 11 భాషల్లో ప్రచురించే 20 ప్రముఖ పత్రికల అధినేతలతో మంగళవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే, ఉదయం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్కువమంది పాల్గొన్నారని, దాంతో, కొద్దిమందితో మాట్లాడగలిగానని ప్రధాని మోదీ తెలిపారు. అప్పుడు సరిగా మాట్లాడడం కుదరలేదని, అందుకే, ఇప్పుడు ఫోన్‌ చేశానని చెప్పారు.


కరోనాపై పోరాటం, మూడు వారాల కర్ఫ్యూ విషయంలో సూచనలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. దాంతో, మూడు వారాల కర్ఫ్యూ సమయంలో నిత్యావసర సరకుల సరఫరా ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని ఆర్కే తెలిపారు. నిత్యావసరాల బ్లాక్‌ మార్కెటింగ్‌ ఇప్పటికే మొదలైందని, రాబోయే రోజుల్లో ధరలు పెంచే ప్రమాదం ఉంటుందని చెప్పారు. లాక్‌డౌన్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించగలిగితే కరోనాపై పోరాటం, కర్ఫ్యూ తప్పక విజయవంతం అవుతాయని స్పష్టం చేశారు. అందుకే, ప్రభుత్వమే విక్రయాలు జరపడం ద్వారా అయినా ఇంటింటికీ నిత్యావసరాలు అందేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని ఆర్కే సూచించారు. దీనిని ‘మంచి సూచన’ అంటూ అభినందించిన ప్రధాని మోదీ.. ‘‘అవును.. లాక్‌ డౌన్‌ చాలా రోజులు కొనసాగుతుంది కదా! ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచిస్తాను’’ అని తెలిపారు. ప్రభుత్వ బాద్యతగా తీసుకుని నిత్యావసరాల కొరత రాకుండా జాగ్రత్త తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Read more