కరోనాతోనే కాదు.. కనిపించని చాలా శత్రువులతో పోరాడుతున్నాం: మోదీ

ABN , First Publish Date - 2020-06-11T18:13:33+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి నోవెల్ కరోనా వైరస్‌తో ఓ వైపు యావత్ ప్రపంచం పోరాడుతుంటే...

కరోనాతోనే కాదు.. కనిపించని చాలా శత్రువులతో పోరాడుతున్నాం: మోదీ

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి నోవెల్ కరోనా వైరస్‌తో ఓ వైపు యావత్ ప్రపంచం పోరాడుతుంటే.. భారత్ మాత్రం కరోనాతో పాటు ఊహించని అనేక విపత్తులతో పోరాడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వరదలు, మిడతలు, వడగండ్లు, చమురుబావుల్లో మంటలు, స్వల్ప భూకంపాలు, రెండు తుపానులు తదితర సమస్యలపై భారత్ ఏకకాలంలో పోరాడుతోందని ప్రధాని గుర్తు చేశారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) 95వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడుతోంది. దాంతో భారత్ కూడా పోరాడుతోంది. అయితే మనకు ఇక్కడ మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.  వరదలు, మిడతలు, వడగండ్లు, చమురుబావుల్లో మంటలు, స్వల్ప భూకంపాలు, రెండు తుపానులు.. వీటన్నితో మనం ఒకేసారి పోరాటం చేస్తున్నాం...’’ అని ప్రధాని పేర్కొన్నారు.


ఈ దేశంలోని ప్రతి పౌరుడూ... నేటి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని దేశానికే ఓ టర్నింగ్ పాయింట్‌గా మలచాల్సిన అవసరం ఉంది. ‘‘ఆ టర్నింగ్ పాయింట్.. సాధికార భారత్..’’ అని ప్రధాని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం స్వామి వివేకానందుడు రాసినట్టు.. భారతీయులు తమ సొంత ఉత్పత్తులను ఉపయోగించి, భారతీయ కళలలకు ఇతర దేశాల్లో మార్కెట్‌ను సృష్టించేలా పురికొల్పాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా అనంతర ప్రపంచంలో భారత్‌కు వివేకానందుడు చెప్పిన ఈ మాటలే స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ‘‘ఈ విపత్కర సమయంలో భారత ఆర్ధిక వ్యవస్థను ‘ఆధిపత్యం- నియంత్రణ’ అనే చట్రం నుంచి బయటపడేసి ‘ప్లగ్ అండ్ ప్లే’ దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సంప్రదాయక విధానాలకు ఇది సమయం కాదు. సాహసోపేత నిర్ణయాలు, పెట్టుబడుల వైపు అడుగులు వేయాల్సిన సమయం ఇది...’’ అని ప్రధాని పేర్కొన్నారు.


ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయనీ.. మన దేశం తన కాళ్లపై తాను నిలబడాలని ప్రధాని ఆకాంక్షించారు. ‘‘విదేశాలపై ఆధారపడటం తగ్గించుకుని స్వదేశీ నినాదం ఊపందుకోవాలి. అందుకే మనం ఆత్మనిర్భర్‌ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. ఎన్నో దేశాలకు మనం ఎగుమతులు చేస్తున్నాం. రైతుల కోసం అనేక పథకాలు ప్రారంభించాం. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయానికి ఐసీసీ తోడ్పాటు అందించాలి..’’ అని ప్రధాని మోదీ కోరారు.

Updated Date - 2020-06-11T18:13:33+05:30 IST