కరోనావైరస్ బారి నుంచి మమ్మల్ని రక్షించండి ప్లీజ్

ABN , First Publish Date - 2020-02-08T16:11:35+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జపాన్ దేశానికి చెందిన డైమండ్ ప్రిన్సెస్ ఓడలో చిక్కుకుపోయిన భారతీయుడొకరు తమను రక్షించాలని కోరుతూ భారత సర్కారుకు సందేశం పంపించారు....

కరోనావైరస్ బారి నుంచి మమ్మల్ని రక్షించండి ప్లీజ్

నిర్బంధంలో ఉన్న ఓడలో నుంచి భారతీయుడి వినతి

కోల్‌కతా : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జపాన్ దేశానికి చెందిన డైమండ్ ప్రిన్సెస్ ఓడలో చిక్కుకుపోయిన భారతీయుడొకరు తమను రక్షించాలని కోరుతూ భారత సర్కారుకు సందేశం పంపించారు. డైమండ్ ప్రిన్సెస్ ఓడను జపాన్ దేశంలోని యోకోహామా ఓడరేవు సమీపంలో నిలిపి అందులోనే తమను నిర్బంధించారని భారతీయులు ఆవేదనగా చెప్పారు.‘‘ డైమండ్ ప్రిన్సెస్ ఓడలో ఉన్న ప్రయాణికులను పరీక్షించగా 21 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది...శనివారం నాడు కరోనా వైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య 62కి పెరిగింది. ఓడలో 41 మంది భారతీయులు నిర్బంధంలో ఉన్నారు...ఓడలో 160 మంది భారతీయులు పనిచేస్తున్నారని, కరోనా వైరస్ భయం పెరుగుతున్నందున, మేం ప్రమాదంలో ఉన్నాం, రక్షించండి’’ అంటూ ఓడలో పనిచేస్తున్న బినయ్ కుమార్ సర్కార్ ఫేస్‌బుక్ వీడియోలో కోరారు.


మమ్మల్ని ఓడ నిర్బంధంలోనుంచి బయటకు తీసుకువెళ్లి తమను ఐసోలేషన్ వార్డుల్లో చేర్పించాలని బినయ్ కుమార్ విన్నవించారు. మా గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని, దయచేసి తమకు సహాయం చేయాలని బినయ్ కుమార్ 1 నిమిషం 56 సెకండ్ల వీడియో క్లిప్ లో కోరారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దినజ్ పూర్ జిల్లా కంకి ప్రాంతానికి చెందిన బినయ్ కుమార్ పోస్టు చేసిన వీడియోను వందలాదిమంది షేర్ చేయడంతో ఇదికాస్తా పశ్చిమబెంగాల్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రాజీబ్ బెనర్జీ దృష్టికి పోయింది. తాను కోల్ కతాలోని జపాన్ కాన్సులేట్ ను సంప్రదించి భారతీయులకు సహాయం చేసేందుకు యత్నిస్తున్నామని మంత్రి రాజీబ్ బెనర్జీ చెప్పారు.

Updated Date - 2020-02-08T16:11:35+05:30 IST