ప్లీజ్‌.. మమ్మల్ని భారత్‌కు రానివ్వండి!!

ABN , First Publish Date - 2020-03-16T09:15:17+05:30 IST

ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాదిలాది మంది ఏపీ, తెలంగాణ సహా పలు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు భారత్‌కు...

ప్లీజ్‌.. మమ్మల్ని భారత్‌కు రానివ్వండి!!

  • భారత ప్రభుత్వం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ నిబంధన వల్లే ఇటలీలో ఇరుక్కుపోయాం 
  • వ్యాధి లక్షణాలుంటేనే ఇక్కడ వైద్య పరీక్షలు
  • కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
  • తెలుగు విద్యార్థుల ఆవేదనభరిత వీడియోలు 


రోమ్‌(ఇటలీ), మార్చి 15: ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాదిలాది మంది ఏపీ, తెలంగాణ సహా పలు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు భారత్‌కు తిరిగిరాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కరోనా ఇన్ఫెక్షన్‌ లేదని ధ్రువీకరిస్తూ ఇటలీ వైద్యుల నుంచి సర్టిఫికెట్‌ పొందినవారినే రానిస్తామని భారత్‌ విధించిన నిబంధన విద్యార్థులను ఇక్కట్లపాలు చేస్తోంది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికే వైద్యపరీక్షలు నిర్వహిస్తామని ఇటలీ వైద్యులు చెబుతుంటే.. తమకు ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం ఎలా వస్తుందని తెలుగు విద్యార్థులు వాపోతున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా తమకు సహకరించడం లేదంటున్నారు. భారత ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి తాము స్వదేశానికి వచ్చేందుకు సహాయపడాలని వేడుకుంటూ రెండు వీడియోలను వారు మీడియాకు పంపారు.


3 రోజులు విమానాశ్రయంలోనే..

‘భారత్‌కు వచ్చేందుకు టికెట్లు బుక్‌ చేసుకొని.. మార్చి 11నే రోమ్‌ విమానాశ్రయానికి చేరుకున్నాం. 13వ తేదీ దాకా అక్కడే గడిపినా విమానం మాత్రం రాలేదు. ఈక్రమంలోనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చాకే పంపిస్తామని అధికారులు స్పష్టం చేశారు. డాక్టర్లు సహకరించడం లేదని చెప్పినా వినలేదు. చివరకు విమానం రద్దయిందని మాత్రం చెప్పారు. భారత ప్రభుత్వమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ నిబంధనతో అడ్డుకుంటే..మా బాధ ఇంకెవరితో చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలైనా మా గోడు విని స్పందించాలి.’   

 -  రోమ్‌లోని ఓ తెలుగు విద్యార్థి ఆవేదన

Updated Date - 2020-03-16T09:15:17+05:30 IST