ప్లాస్మా థెరపీపై సంచలన ప్రకటన చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2020-04-28T22:38:04+05:30 IST

కరోనా సోకిన వారికి వ్యాధిని నయం చేసే నిమిత్తం పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న...

ప్లాస్మా థెరపీపై సంచలన ప్రకటన చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధిని నయం చేసే నిమిత్తం పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్లాస్మా థెరపీపై పరిశోధన జరుపుతోందని కేంద్రం ప్రకటించింది.


ఇప్పటికైతే కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా థెరపీ నిరూపిత చికిత్స విధానం కాదని, ఈ విధానాన్ని ఎవరూ అనుసరించవద్దని కేంద్రం సూచించింది. ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడికి ప్రమాదకరమని, అంతేకాకుండా చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.


ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే ఉందని, కరోనాకు ఇదే చికిత్స విధానమని ఎలాంటి ఆధారం లేదని ఆయన తెలిపారు. ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ప్లాస్మా థెరపీని దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేయాలని కోరుతున్నాయి. కేంద్రం తాజా ప్రకటనతో ఆయా రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి.Updated Date - 2020-04-28T22:38:04+05:30 IST