కరోనా బాధితులకు అంతగా ప్రయోజనమివ్వని ప్లాజ్మా థెరపీ!
ABN , First Publish Date - 2020-10-24T14:53:15+05:30 IST
కరోనా బాధితులకు వ్యాధి నుంచి ఉపశమనం కోసం అందిస్తున్న ప్లాజ్మా థెరపీపై...

న్యూఢిల్లీ: కరోనా బాధితులకు వ్యాధి నుంచి ఉపశమనం కోసం అందిస్తున్న ప్లాజ్మా థెరపీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీరి అధ్యయనంలోని పలు ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. కరోనా బాధితులకు ప్లాజ్మా థెరపీ అందించినా కూడా వారికి ఆశించినంతగా ఉపశమనం కలగడం లేదని వెల్లడయ్యింది.
ప్లాజ్మా అందించడం వలన వ్యాధి తీవ్రత తగ్గడం గానీ, ప్రాణాపాయం తప్పడం లాంటి అవకాశాలు చాలా స్పల్పంగానే ఉంటాయని తేలింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం ప్లాజ్మీ థెరపీ అందించిన 464 మంది కరోనా బాధితులపై పరిశోధనలు జరపగా, 400కు మించిన బాధితులలో ప్లాజ్మా థెరపీ వలన అంతగా ప్రయోజనం లేదని తేలింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య 464 మంది కరోనా బాధితులపై నిర్వహించిన అధ్యయనంలో 239 మందికి రెండుసార్లు ప్లాజ్మా అందించారు. మరో 229 మందికి కరోనాకు సంబంధించిన ఇతర చికిత్సలు అందించారు. ఒక నెల రోజుల తరువాత ప్లాజ్మా ఇచ్చిన బాధితులోని 44 మంది ఆరోగ్యం విషయమించి మృతి చెందారు. అయితే తమిళనాడుకు చెందిన వైద్యశాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ప్లాజ్మా థెరపీ ఇవ్వడం వలన బాధితులలో కరోనా లక్షణాలు తగ్గుముఖం పడతాయిని తేలింది.