‘ప్లాస్మా థెరపీ’ ఔట్‌?

ABN , First Publish Date - 2020-10-21T08:39:53+05:30 IST

ప్లాస్మా థెరపీని కరోనా చికిత్సకు సంబంధించిన జాతీయ ప్రొటోకాల్‌ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

‘ప్లాస్మా థెరపీ’ ఔట్‌?

న్యూఢిల్లీ, అక్టోబరు 20 : ప్లాస్మా థెరపీని కరోనా చికిత్సకు సంబంధించిన జాతీయ ప్రొటోకాల్‌ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ మంగళవారం వెల్లడించారు. ఈ అంశంపై కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌తో ఇప్పటికే చర్చించామని.. ప్రస్తుతం సంయుక్త పర్యవేక్షక బృందంలోని నిపుణులతో తమ (ఐసీఎంఆర్‌) చర్చలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. యాంటీ వైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌, మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు కరోనా రోగులపై పనిచేయట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన నేపథ్యంలో.. వాటిపైనా జాతీయ టాస్క్‌ఫోర్స్‌ పునస్సమీక్షిస్తోందన్నారు. వాటిని ప్రభుత్వ నిర్దేశిత కరోనా ఔషధ జాబితా నుంచి తొలగించాలా ? కొనసాగించాలా ? అనే దానిపైనా చర్చోపచర్చలు జరుగుతున్నట్లు బలరాం భార్గవ వివరించారు. కాగా, సెప్టెంబరులో ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 464 మంది కరోనా రోగులపై నిర్వహించిన ప్లాస్మాథెరపీ ప్రయోగ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కరోనా కట్టడికి ఆ చికిత్సా పద్ధతి దోహదకరంగా లేదని తేలింది. 

Updated Date - 2020-10-21T08:39:53+05:30 IST