ఇలాగైతే విమానాలు నడపం.. పైలట్ సంఘం హెచ్చరిక!
ABN , First Publish Date - 2020-06-02T01:24:31+05:30 IST
తమ విమాన సిబ్బందిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పెట్టారని ఎయిరిండియా పైలట్ సంఘం ఆరోపించింది.
న్యూఢిల్లీ: తమ విమాన సిబ్బందిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పెట్టారని ఎయిరిండియా పైలట్ సంఘం ఆరోపించింది. ఇలా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తే తాము విమానాలు నడపబోమని హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నుంచి మాస్కో వెళ్లే ఓ విమానం నడుపుతున్న పైలట్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసి విమానాన్ని తిరిగి ఢిల్లీ తీసుకొచ్చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఆరోగ్యశాఖ అధికారులు విమాన సిబ్బందిని ఇబ్బందులు పెట్టారని పైలట్ సంఘం ఆరోపిస్తోంది. రోజు మొత్తం సిబ్బందికి కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా వెయిట్ చేయించారని, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. మరోసారి ఇలానే జరిగితే తాము విమానాలు నడపబోమని హెచ్చరించింది.