ఫైజర్ వ్యాక్సిన్.. మనకొద్దులే!!
ABN , First Publish Date - 2020-12-15T07:50:50+05:30 IST
భారీ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సన్నా హాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఫైజర్ కంపెనీ కొవిడ్ వ్యాక్సిన్‌ను ఇప్పట్లో కొనే అవకాశం లేదని తెలుస్తోంది.
తక్కువ రేటు వ్యాక్సిన్ల వైపే భారత్ మొగ్గు
తొలి విడతలో రూ.13,900 కోట్లతో 68 కోట్ల డోసులు?
న్యూఢిల్లీ, డిసెంబరు 14: భారీ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సన్నా హాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఫైజర్ కంపెనీ కొవిడ్ వ్యాక్సిన్‌ను ఇప్పట్లో కొనే అవకాశం లేదని తెలుస్తోంది. ఒక డోసుకు రూ.2,700(37 డాలర్లు) భారీ ధర, మైనస్ 70 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు అందుబాటులో లేనందున దాని కొనుగోలుకు మొగ్గు చూపకపోవచ్చని అంటున్నారు. రూ.221కే ఒక డోసు(కొవిషీల్డ్)ను అందిం చేందుకు అంగీకరించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచే వ్యాక్సిన్ల కొనుగోలుకు భారత్ తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధర సగటున రూ.220-440 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ డోసు ధర కూడా రూ.735 మించకపోవచ్చు. తక్కువ రేటుకు లభిస్తున్న వ్యాక్సిన్ల నిల్వ ప్రక్రియ ఫైజర్ కంటే సులువుగా ఉండటాన్ని అత్యంత సానుకూల అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు. తొలి విడతగా భారత్ 68 కోట్ల డోసులను కొనుగోలు చేయొచ్చని, డోసుకు రూ.221 చొప్పున రూ.13,900 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని ప్రముఖ పరిశో ధనా సంస్థ ‘బెర్న్‌స్టీన్’ అంచనా వేసింది. దేశంలోని 135 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలంటే దాదాపు రూ.44,100 కోట్లు సిద్ధం చేసుకోవాల్సి రావచ్చని తెలిపింది.
తొలి విడత వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ డోసులను కేటాయిస్తారు. ఈ లెక్కన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల కంటే తక్కువ జనాభా ఉన్న తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువ డోసులు అందనున్నాయి. దేశంలో ప్రయోగ పరీక్షలు నిర్వహించకుండానే వ్యాక్సిన్‌ను విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు ఫైజర్ కంపెనీ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దాన్ని పరిశీలించిన విషయ నిపు ణుల కమిటీ(ఎస్‌ఈసీ) 1600-2000 మంది వలంటీర్లతో భారత్‌లోనూ ఫైజర్ కంపెనీ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని డీసీజీఐకు సూచించినట్లు సమాచారం. ఫైజర్ కంపెనీ నూతన ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞా నంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందున స్థానిక ట్రయల్స్ ద్వారా ప్రభావ శీలతను నిరూపించుకోవడం ఆవశ్యకమని నిపుణుల కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ డోసులను సింగపూర్ కొనుగోలు చేయనుంది.
స్పుత్నిక్-వి ప్రభావశీలత 91.4ుగా నిర్ధారణ
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ ప్రభావశీలత 91.4ుగా నిర్ధారణ అయింది. తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్ కేసుల్లోనూ వ్యాక్సిన్ 100ు ప్రభావశీలతను చూపిందని గమలేయ సెంటర్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సంయుక్తంగా ప్రకటించాయి.