ఎమ్మెల్యేగా కేజ్రీవాల్ ఎన్నికపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2020-08-20T22:39:24+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవడాన్ని

ఎమ్మెల్యేగా కేజ్రీవాల్ ఎన్నికపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేజ్రీవాల్ తన ఎన్నికల ఖర్చు గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషనర్ ఆరోపించారు. 


పిటిషనర్ రమేశ్ ఖాత్రి విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ నవంబరు 25న జరుగుతుందని హైకోర్టు తెలిపింది. 


రమేశ్ ఖాత్రి రెండు వేర్వేరు పిటిషన్ల ద్వారా అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత విజేందర్ గుప్తా ఎన్నికలను సవాల్ చేశారు. వీరిద్దరూ ఎన్నికల ఖర్చుపై తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. 


ఈ రెండు పిటిషన్లు జస్టిస్ సి హరి శంకర్ ధర్మాసనం వద్ద విచారణకు వచ్చాయి. అయితే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన విచారణకు రెండుసార్లు పిలిచినప్పటికీ పిటిషనర్ ఖాత్రి హాజరు కాలేదు. దీంతో వీటిని హైకోర్టు నవంబరు 25కు రీ నోటిఫై చేసింది. 


కేజ్రీవాల్, గుప్తాలను ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని రమేశ్ ఖాత్రి తన పిటిషన్లలో కోరారు. వీరిద్దరూ తమ ఎన్నికల ఖర్చును సక్రమంగా తెలియజేయలేదని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 


ప్రజా ప్రాతినిథ్య చట్టం, 1951; ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి, 1961లను వీరిద్దరూ ఉల్లంఘించినందువల్ల వీరి ఎన్నికలు చెల్లనివిగా ప్రకటించాలని కోరారు. 


Updated Date - 2020-08-20T22:39:24+05:30 IST