కోర్టు ధిక్కార చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2020-08-01T19:24:31+05:30 IST

కోర్టు ధిక్కార చట్టం వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తోందంటూ సుప్రీంకోర్టులో ఓ

కోర్టు ధిక్కార చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : కోర్టు ధిక్కార చట్టం వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తోందంటూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలను వినియోగించుకోవడాన్ని ఈ చట్టం నిరుత్సాహపరుస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. 


సీనియర్ పాత్రికేయుడు ఎన్ రామ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 


1971నాటి కోర్టు దిక్కార చట్టం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. దీనిలోని కొన్ని నిబంధనలను రద్దు చేయాలని కోర్టును కోరారు. 


ఆక్షేపణకు గురవుతున్న సబ్ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమైనది చెప్పారు. రాజ్యాంగ ప్రవేశికలోని విలువలతో ఇది పొసగడం లేదన్నారు. రాజ్యాంగ మౌలిక లక్షణాలతో దీనికి పొంతన లేదన్నారు. రాజ్యాంగపరంగా చూసినా ఇది అస్పష్టంగా ఉందని, నిరంకుశంగా ఉందని పేర్కొన్నారు. 


ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కార ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఆయన న్యాయ వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యానికి విఘాతం కలగడంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. 


దీనిపై కోర్టు గత నెలలో స్పందిస్తూ, ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు సుప్రీంకోర్టు వ్యవస్థ హోదా, అధికారం పట్ల, భారత ప్రధాన న్యాయమూర్తి పదవి పట్ల ప్రజల దృష్టిలో చులకన భావం కలిగించేవిధంగా ఉన్నాయని పేర్కొంది. 


కోర్టు ధిక్కార చర్య స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈ ట్వీట్లను ఎందుకు తొలగించలేదో చెప్పాలని కోరేందుకు ట్విటర్ ఇండియాను  ప్రొసీడింగ్స్‌‌లో కోర్టు చేర్చింది. తదుపరి విచారణ ఆగస్టు 4న జరుగుతుంది. 


పాత్రికేయుడు ఎన్ రామ్‌ కూడా కోర్టు దిక్కార సంబంధిత విచారణను ఎదుర్కొంటున్నారు. కొల్లం లిక్కర్ ట్రాజెడీ కేసులో కేరళ హైకోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రచురించినందుకు ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది.


జస్టిస్ కుల్దీప్ సింగ్ కమిషన్‌ గురించి రాసిన వ్యాసానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అయితే ఈ వ్యాసం కోర్టు ధిక్కారం కాదని కోర్టు తీర్పు చెప్పింది.


Updated Date - 2020-08-01T19:24:31+05:30 IST