ఫేస్‌బుక్‌ చర్చల్లో ఆధిపత్యం కోసం కాంగ్రెస్ ఆరాటం : రవిశంకర్ ప్రసాద్

ABN , First Publish Date - 2020-08-18T22:58:42+05:30 IST

రాజకీయంగా బలం కోల్పోయినవారు సామాజిక మాధ్యమాల చర్చల్లో ఆధిపత్యం కోసం

ఫేస్‌బుక్‌ చర్చల్లో ఆధిపత్యం కోసం కాంగ్రెస్ ఆరాటం : రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ : రాజకీయంగా బలం కోల్పోయినవారు సామాజిక మాధ్యమాల చర్చల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని భారతీయ జనతా పార్టీ మంగళవారం ఎద్దేవా చేసింది. ప్రతి ఒక్కరూ తమ సైద్ధాంతిక భావజాలంతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కును కలిగియున్నారని తెలిపింది. 


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తనకు నచ్చినట్లు పని చేయని ఏ సంస్థ అయినా బీజేపీ, ఆరెస్సెస్ ఒత్తిడితో వ్యవహరిస్తున్నట్లు రాహుల్ గాంధీ విశ్వసిస్తున్నారని దుయ్యబట్టారు. 


ఇటీవల ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో పేస్‌బుక్‌‌పై ప్రచురితమైన ఓ వ్యాసంలో, భారత దేశంలోని అధికార పార్టీ నాయకులకు విద్వేష ప్రసంగాల నిబంధనలను వర్తింపజేయడాన్ని పేస్‌బుక్‌‌ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. 


దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఓటర్లను ప్రభావితం చేయడం కోసం బీజేపీ, ఆరెస్సెస్ బూటకపు వార్తలను పేస్‌బుక్‌‌, వాట్సాప్ ద్వారా వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించారు. దీంతో బీజేపీ ఘాటుగా స్పందించింది. 


విలేకర్ల సమావేశంలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనంపై ఎలా స్పందించాలో నిర్ణయించుకోవలసినది ఫేస్‌బుక్‌ అని తెలిపారు. వందలాది మంది బీజేపీ మద్దతుదారుల పేజీలను కూడా ఫేస్‌బుక్ తొలగించిందని చెప్పారు. 


ప్రతి భారతీయునికి బహిరంగ వేదికపై తన భావజాలంతో సంబంధం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉందన్నారు. అందరూ తెలుసుకోవలసిన కఠోర వాస్తవం ఒకటి ఉందని, అదేమిటంటే, రాజకీయంగా బలహీనపడినవారు ఇలాంటి వేదికలపై చర్చల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని వ్యాఖ్యానించారు. 


బీజేపీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో, ఢిల్లీ శాసన సభ ఎన్నికల సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించకపోతే, ఆరు నెలల్లోగా యువత ఆయనను కర్రలతో కొడతారని రాహుల్ అన్నారని గుర్తు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టడానికి సంబంధించిన స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. 


Updated Date - 2020-08-18T22:58:42+05:30 IST