పాలవ్యాన్‌లో దొంగతనంగా సొంతూళ్లకు.. వీడియో షేర్ చేసిన బాలీవుడ్ హీరో..
ABN , First Publish Date - 2020-03-27T18:38:02+05:30 IST
వీధి చివర ఓ పాలవ్యాన్ వచ్చి ఆగింది. డ్రైవర్ వచ్చి వ్యాన్ ఎక్కి పై మూత తీశాడు. అంతే ఉన్నట్లుండి అందులోంచి ఒక్కొక్కరుగా మనుషులు బయటకు వచ్చి...
వీధి చివర ఓ పాలవ్యాన్ వచ్చి ఆగింది. డ్రైవర్ వచ్చి వ్యాన్ ఎక్కి పై మూత తీశాడు. అంతే ఉన్నట్లుండి అందులోంచి ఒక్కొక్కరుగా మనుషులు బయటకు వచ్చి దిగి వెళ్లిపోతున్నారు. అదేంటి పాలవ్యాన్‌లో పాలు తీసుకువస్తారు కానీ మనుషులను కూడా తీసుకొస్తారా అని అలోచిస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే.
కరోనా వైరస్ మహమ్మారి విజృభిస్తుండడంతో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వేరే ప్రాంతాల్లో చిక్కుకున్నవారు తమ తమ సొంతూళ్లకు కూడా వెళ్లకుండా రాష్టాలు, జిల్లాల సరిహద్దులు మూసేశారు. దీంతో సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు.
లాక్‌డౌన్ ఉన్నప్పటికీ ప్రజలకు నిత్యావసరాలైన పాలు, బియ్యం, కూరగాయలు ఇతర వస్తువులను రవాణా చేసే వాహనాలను మాత్రం అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీరంతా ఈ మార్గాన్ని ఎంచుకుని తమ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ వీడియోను బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘దేశం సరిహద్దుల లోపల మనుషుల స్మగ్లింగ్ జరుగుతోందా..’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.
అయితే వీరంతా ఆకలితో బాధపడుతూ, ఉండడానికి చోటు లేక, చేతిలో డబ్బులు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇలా వచ్చి ఉంటారంటూ కొందరు నెటిజన్లు రితేశ్ వీడియోకు రిప్లైలు పెడుతూ వారిపై సానుభూతి చూపిస్తున్నారు.
గమ్యాలకు చేరుకున్నారు కాబట్టి సరిపోయింది. మధ్యలో పోలీసులకు దొరికుంటూ మాత్రం జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చేది. అయితే లాక్‌డౌన్ ప్రజల మంచి కోసమేనని ప్రభుత్వాలు కోడై కూస్తున్నా ఇలాంటి వారి చెవికి మాత్రం ఎక్కకపోవడం దురదృష్టం.