ఖర్చులకు జనం దూరం... జీడీపీకి తప్పదు నష్టం...

ABN , First Publish Date - 2020-03-25T20:38:15+05:30 IST

ప్రస్తుతం దేశంలో అమలవుతున్న అష్ట దిగ్బంధనం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. యాక్సిస్ కేపిటల్ అంచనా ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

ఖర్చులకు జనం దూరం... జీడీపీకి తప్పదు నష్టం...

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలో అమలవుతున్న అష్ట దిగ్బంధనం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. యాక్సిస్ కేపిటల్ అంచనా ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ప్రజల ఖర్చులు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుంది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ 21 రోజులపాటు దేశంలో అష్ట దిగ్బంధనం (లాక్ డౌన్) పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారితో పోరాటంలో ఇటువంటి చర్యలు తప్పవని చెప్పారు. 


ప్రజలు తమకు నచ్చిన వస్తువులను కొనడం, వినోదం కోసం ఖర్చు పెట్టడం వంటివి ప్రతి నెల జరుగుతాయి. సగటు భారతీయ వినియోగదారుడు నెలకు దాదాపు రూ.5,700 వరకు ఈ విధమైన ఖర్చులు పెడతాడని అంచనా. బట్టలు, చెప్పులు కొనడం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, గృహోపకరణాలను కొనడం వంటివాటికోసం ఈ సొమ్మును వెచ్చిస్తాడు. 


అష్ట దిగ్బంధనం వల్ల వినియోగదారులు తమ ఖర్చులను వాయిదా వేసుకుంటారు. దీంతో నెలకు 45 బిలియన్ డాలర్లు అంటే సుమారు  రూ.3.3 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వాయిదా పడుతుంది. ఈ దిగ్బంధనం కేవలం పట్టణాలకే పరిమితమైతే ఇది 22 బిలియన్ డాలర్లకే పరిమితమై ఉండేది. 


ప్రజలు తమ ఖర్చులను వాయిదా వేసుకోవడం వల్ల మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాలపై ప్రభావం పడుతుంది. 


ఫలితంగా రోజువారీ జీడీపీపై 20 శాతం ప్రభావం పడుతుందని భావిస్తే, రోజుకు జీడీపీపై రూ.10,500 కోట్ల మేరకు ప్రభావం పడుతుందని అంచనా.

Read more