యూపీఏ చైర్మన్‌గా పవార్‌?

ABN , First Publish Date - 2020-12-11T09:26:23+05:30 IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరాఠా నేత శరద్‌ పవార్‌ను యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి.

యూపీఏ చైర్మన్‌గా పవార్‌?

అవన్నీ ఊహాగానాలే: ఎన్సీపీ

రాజకీయాల్లో ఏవైనా జరగొచ్చు: శివసేన


న్యూఢిల్లీ, డిసెంబరు  10 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరాఠా నేత శరద్‌ పవార్‌ను యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ ఈ పదవి నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు  సోనియాగాంధీ త్వరలో ఈ బాధ్యత నుంచి తప్పుకుంటారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రైతుల ఆందోళన సందర్భంగా ఇటీవల నేతలతో సంప్రదిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఈ పదవిలో కొనసాగే విషయంలో తన విముఖత ప్రదర్శించారని ఈ వ ర్గాలు వెల్లడించాయి. తన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాల్సిందిగా ఆమె సూచించారు. అంతర్గత సంభాషణలో శరద్‌ పవార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం.


కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు కూడా జనవరిలో జరిపించి పార్టీ అధ్యక్ష స్థానంలో మరొక నేతను ఎన్నుకోవాలని కూడా సోనియా భావిస్తున్నారు. గత ఏడాది పార్టీ పరాజయం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి  రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ ఆ బాధ్యతలను తిరిగి స్వీకరించడానికి అంగీకరించకపోవడంతో సోనియాయే తిరిగి తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో పార్టీ నేతగా మళ్లీ రాహుల్‌ గాంఽధీ బాధ్యతలు స్వీకరిస్తారా, లేక మరో నేతను ఎన్నుకుంటారా.... అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.  డీఎంకే, ఎన్సీపీ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు రాహుల్‌ గాంధీతో సంప్రదించడానికి నిరాకరిస్తున్నారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ పటుతరమైన శక్తిగా యూపీఏని మార్చేందుకు శరద్‌ పవార్‌ తగిన వ్యక్తి అని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. శరద్‌ పవార్‌ కనుక యూపీఏ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే కూటమిలో ఉన్న పార్టీలనే  కాక దేశంలో ఇతర పార్టీలను కూడా కలుపుకొని పోగలరన్న విశ్వాసాన్ని కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో శివసేన వంటి భిన్నాభిప్రాయాలు గల పార్టీని కూడా ఆయన విశ్వాసంలోకి తీసుకుని బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయగలిగారని వారు ఉదాహరిస్తున్నారు. శరద్‌పవార్‌ యూపీఏ చీఫ్‌ పదవిని చేపట్టవచ్చన్నది ఊహాగానాలేనని ఎన్సీపీ తోసిపుచ్చింది.


ఇందుకు సంబంధించి యూపీఏ పార్టీల్లో ఎలాంటి చర్చా జరగలేదని, రైతుల ఆందోళన నుంచి దృష్టి మరల్చేందుకు కొన్ని స్వార్థపర రాజకీయ శక్తులు ఈ రకమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయని ఎన్సీపీ  ప్రతినిధి మహేశ్‌ తాప్సీ అన్నారు.  శివసేన మాత్రం- రాజకీయాల్లో ఏదేనా సాధ్యమేనని వ్యాఖ్యానించింది. 

Updated Date - 2020-12-11T09:26:23+05:30 IST