రాహుల్‌...కొత్త సమస్యలు తలకెత్తుకోలేం: పాశ్వాన్

ABN , First Publish Date - 2020-05-08T23:16:00+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలో లేని వారికి కూడా ఆహార భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన .

రాహుల్‌...కొత్త సమస్యలు తలకెత్తుకోలేం: పాశ్వాన్

న్యూఢిల్లీ: ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలో లేని వారికి కూడా ఆహార భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన సూచనను కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కొత్త సమస్యలు కొని తెచ్చుకోలేమని ఆయన సమాధానమిచ్చారు.


వలస కార్మికుల కోసం రైళ్లు నడపడాన్ని పాశ్వాన్ ఒక ఉదాహరణగా పేర్కొంటూ కొత్త సమస్యలకు తెరలేపాలని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. 'వలస కార్మికుల కోసం నడుపుతున్న రైళ్లను ఉదాహరణగా తీసుకోండి. ఇవాళ రైళ్లలో పోట్లాటలు జరిగాయి. పీడీఎస్‌ విషయంలో అలా మేము చేయదలచుకోలేదు' అని మంత్రి తెలిపారు.


రాబోయే ఆరు నెలలు ప్రతి ఒక్కరికీ కిలో చక్కెర, 10 కిలోల ఆహార ధాన్యాలు, కిలో పప్పులు సరఫరా చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్పడంపై పాశ్వాన్ స్పందిస్తూ, అది పూర్తిగా విధాన నిర్ణయమని చెప్పారు. ఆహార భద్రతా చట్టం ప్రకారమే తాము పనిచేస్తామని, కొత్త సమస్యలకు తావిచ్చేది లేదని అన్నారు. 2021 నాటికి కొత్త జనాభా లెక్కలు వస్తాయని, దీనితోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి పోర్టల్‌లో ఉంచాలని అన్నారు.


రైతుల పండించే ప్రతి గింజ కొనుగోలుకు తమ మంత్రిత్ర శాఖ భరోసా ఇస్తుందని పాశ్వాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తే, పరిహారం తాము ఇస్తామని చెప్పారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం ఉత్పత్తులు తాము సేకరిస్తామనే విషయం రాహుల్‌ గాంధీకి తెలుసుననే తాను అనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. 'ఒక దేశం, ఒక రేషన్ కార్డు' పథకంపై మాట్లాడుతూ, 17 రాష్ట్రాలు ఇప్పటికే రేషన్ కార్డులను డిజిటలైజ్ చేశాయని, వచ్చే ఏడాది అన్ని రాష్ట్రాలకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి సేకరించిన బియ్యాన్ని రాష్ట్రాలు పంపిణీ చేయాలని, దెబ్బతిన్న బియ్యాన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ప్రసక్తే లేదని కూడా మంత్రి తెలిపారు.

Updated Date - 2020-05-08T23:16:00+05:30 IST