విమానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు: డీజీసీఏ

ABN , First Publish Date - 2020-09-14T00:46:16+05:30 IST

విమానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని, వాటిపై ఎటువంటి నిషేధమూ లేదని పౌర విమానయాన సంస్థ రెగ్యులేటరీ డీజీసీఏ

విమానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు: డీజీసీఏ

న్యూఢిల్లీ: విమానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని, వాటిపై ఎటువంటి నిషేధమూ లేదని పౌర విమానయాన సంస్థ రెగ్యులేటరీ డీజీసీఏ స్పష్టం చేసింది. అయితే, విమానంలో గందరగోళం సృష్టించే, విమాన కార్యకలాపాల్లో అంతరాయం కలిగించేలా రికార్డింగ్ గాడ్జెట్లను ఉపయోగించడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని, వాటిని విమాన సిబ్బంది నిషేధిస్తారని డీజీసీఏ పేర్కొంది. కాగా, విమానం లోపల ఎవరైనా ఫొటోలు తీస్తూ కనిపిస్తే ఆ విమానాన్ని రెండు వారాల పాటు నిషేధిస్తామని నిన్న డీజీసీఏ హెచ్చరించింది. 


రెండు రోజుల క్రితం చండీగఢ్-ముంబై ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ను ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. మీడియా ప్రతినిధులు సామాజిక దూరం నిబంధనలు పక్కన పెట్టేసి భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించారు. దీంతో ‘తగిన చర్యలు’ తీసుకోవాల్సిందిగా డీజీసీఏ ఇండిగోను కోరింది. ఈ నెల 9న ఇండిగో విమానంలో ముందు వరుసలో కూర్చున్న కంగనను ఫొటోలు తీసేందుకు, ఆమెతో మాట్లాడించేందుకు రిపోర్టర్లు, కెమెరామెన్లు తోసుకున్నట్టు విమానం లోపల తీసిన వీడియోను బట్టి తెలుస్తోంది. 


విమాన ప్రయాణంలో, టేకాఫ్, లాండింగ్ సమయంలో విమానం లోపల ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చంటూ 9 డిసెంబరు 2004 నాటి సర్క్యులర్‌ను ఉటంకిస్తూ ఆదివారం ఈ విషయంలో డీజీసీఏ మరింత స్పష్టత ఇచ్చింది. అయితే, విమాన భద్రతను ప్రమాదంలో పడేసే రికార్డింగ్ పరికరాలకు ఇందులో అనుమతి లేదని పేర్కొంది.   


Updated Date - 2020-09-14T00:46:16+05:30 IST