పరిశ్రమలు మూసేసిన వాళ్లా అభివృద్ధి ఊసెత్తేది?: మోదీ
ABN , First Publish Date - 2020-10-28T20:50:47+05:30 IST
తమ ప్రభుత్వం సాధించిన విజయాలను, ఆర్జేడీ హయాంలోని 'ఆటవిక పాలన'ను మోదీ పోలుస్తూ...

ముజఫర్‌పూర్: రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ చెబుతున్న కొందరు గతంలో ఇక్కడి పరిశ్రమలను మూసేసి చెడ్డపేరు తెచ్చారని ఆర్జేడీ సారథ్యంలోని 'మహాఘట్ బంధన్'పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు ముజఫర్‌పూర్ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. 'ఒకప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు కంపెనీలు సైతం రాష్ట్రం విడిచి పారిపోయాయి. అదే వ్యక్తులు ఇవాళ ఉద్యోగాల గురించి మట్లాడుతున్నారు' అంటూ విపక్షాలపై ఆయన విసుర్లు విసిరారు.
తమ ప్రభుత్వం సాధించిన విజయాలను, ఆర్జేడీ హయాంలోని 'ఆటవిక పాలన'ను మోదీ పోలుస్తూ.. గ్రామాలు, బీహార్ ప్రజల మెరుగైన సౌకర్యాల కోసం ఎన్డీయే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ఎంతో ఖర్చు చేసిందని, ఆ ప్రయోజనాలు ప్రజలకు ఇప్పుడు అందుతున్నాయని చెప్పారు. ఇందుకోసం రూ.లక్ష కోట్ల ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు బీహార్‌లో అలజడులు సృష్టించి, అస్తవ్యస్థమైన పాలన అందించిన వాళ్లు మళ్లీ ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని విపక్షాలను విమర్శించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే రోడ్ మ్యాప్ కానీ, పాలనానుభవం కానీ వారికి లేదన్నారు.
యావత్ ప్రపంచం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల్లో బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం రాష్ట్రానికి అవసరమని చెప్పారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా సుపరిపాలన అందించే వాళ్లే బీహార్‌కు అవసరమని పేర్కొన్నారు. బీహార్‌లో కొన్ని శక్తులు (విపక్షాలు) అధికారంలోకి వస్తే కోవిడ్-19ను ఎదుర్కోవడానికి, స్కీములకు వెచ్చించాల్సిన సొమ్ము ఏమవుతుందో ఊహించండని అన్నారు. కోవిడ్‌పై పోరాటానికి కృతనిశ్చయంతో ముందుకు వెళ్లాలంటే బీహార్‌కు నష్టం చేయాలనుకునే శక్తులను ఓడించాలని మోదీ పిలుపునిచ్చారు. 'మీ ఓటు బీహర్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ఓటు దేశంలో బీహార్ పాత్రను డిసైడ్ చేస్తుంది' అంటూ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.