పాక్షిక సడలింపు!

ABN , First Publish Date - 2020-04-14T08:34:03+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను పొడిగించే విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాడు ప్రకటన చేయనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజలనుద్దేశించి...

పాక్షిక సడలింపు!

కేంద్రమంత్రులు మళ్లీ తమ తమ కార్యాలయాలకు వెళ్లడం మొదలెట్టారు. సోమవారంనాడు దాదాపు 22 మంది మంత్రులు, సీనియర్‌ అధికారులు, ఇతర సిబ్బంది తమ ఆఫీసులకు వెళ్లి, తిరిగి ఫైళ్ల క్లియరెన్స్‌ మొదలెట్టారు. ఇన్నాళ్లూ వర్క్‌ ఫ్రం హోం చేసిన వీరంతా ఒకట్రెండు రోజుల్లో పరిమిత స్థాయిలో సమీక్షలు కూడా మొదలెడతారని తెలుస్తోంది.


  • ఈ రోజు ఉదయం 10 గంటలకు  మోదీ ప్రసంగం
  • ఏప్రిల్‌ 30 వరకూ పొడిగింపు తథ్యం
  • కొన్నిరంగాలకు వెసులుబాటు?
  • పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ఊరట!
  • జోన్ల విభజన ప్రకటన చేసే అవకాశం
  • రాష్ట్రాల డిమాండ్లపై స్పందిస్తారా?
  • ఆఫీసులకు మంత్రులు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను పొడిగించే విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాడు ప్రకటన చేయనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇందులో కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకూ పొడిగించాలని శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో  దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సూచించారు. కొన్ని రాష్ట్రాలు తమంతట తాము లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఈ క్రమంలో ప్రధాని కూడా లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించే ప్రకటన చేస్తారని, అదే సమయంలో  కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలకు సడలింపు ఇస్తారని భావిస్తున్నారు. దాదాపు ఆరేళ్లుగా ఆర్థికరంగం తిరోగమనంలో ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా చతికిల బడ్డాయి. లక్షల మంది పేద ప్రజానీకం ఉపాధి  లేక విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తిరిగి ఆర్థికాన్ని పైకి లేపేందుకు కొన్ని నిర్దిష్ట చర్యలు ప్రకటిస్తారంటున్నారు. పరిమిత సంఖ్యలో పరిశ్రమల పునఃప్రారంభానికి అనుమతిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.   వ్యవసాయ సీజన్‌, కోతల కాలం కావడంతో ఈ రంగానికి పూర్తిస్థాయి మినహాయింపునిచ్చే దిశగా ఆలోచన జరుగుతోంది.


రైతులు నేరుగా మండీలకు తరలించుకోవడానికి లేదా క్షేత్రాల్లోనే పంటను అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించవచ్చు.  వీటితో పాటు నగరాలను, పట్ణణాలను కొవిడ్‌-19 రోగుల తీవ్రతను బట్టి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లగా కూడా విభజించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. వైరస్‌ ప్రభావం అసలే లేని దాదాపు 400 జిల్లాలను గ్రీన్‌ జోన్‌గా ప్రకటించి అక్కడ వ్యవసాయం, నిర్మాణ, తయారీ రంగాల కార్యకలాపాలకు అనుమతిస్తారని గట్టిగా వినిపిస్తోంది. అనేక గ్రామాలు గ్రీన్‌జోన్‌కిందకు వస్తాయని అధికారులు అంటున్నారు. లాక్‌ డౌన్‌ పొడిగించడంతో పాటు ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయా నేతలు చేసిన డిమాండ్లపై ప్రధాని స్పందిస్తారా లేదా  అన్నది ఆసక్తికరంగా మారింది. . కరోనా వైరస్‌ వ్యాప్తి మూలంగా జరిగిన ఆర్థిక నష్టాన్ని పూరించేందుకు ప్యాకేజీ ప్రకటించాలని అనేకమంది సీఎంలు కోరిన విషయం తెలిసిందే.  జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్రింద వ్యవసాయాన్ని అనుమతించాలని, నరేగా పనిదినాలను పెంచాలని, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, రిజర్వు బ్యాంకు అదనపు కరెన్సీని విడుదల చేయాలని వారు కోరారు. 


Updated Date - 2020-04-14T08:34:03+05:30 IST