వాహనాల పార్కింగ్‌కు పార్కులను వాడుకోకండి : ఢిల్లీ హైకోర్టు

ABN , First Publish Date - 2020-10-13T19:44:08+05:30 IST

పార్కులను వాహనాల పార్కింగ్ కోసం వాడుకోరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం చెప్పింది. సుల్తాన్‌పురిలోని ఓ పార్కులో ఆక్రమణలపై దాఖలైన

వాహనాల పార్కింగ్‌కు పార్కులను వాడుకోకండి : ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : పార్కులను వాహనాల పార్కింగ్ కోసం వాడుకోరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం చెప్పింది. సుల్తాన్‌పురిలోని ఓ పార్కులో ఆక్రమణలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి, దురాక్రమణలను నిరోధించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 


దిల్షాద్ సిద్ధిఖీ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. పార్కును పార్కుగానే ఉంచాలని, పార్కింగ్ స్పేస్‌గా మార్చకూడదని చెప్పింది. దీనిని అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వినోదం కోసం ఉద్దేశించిన పార్కులను వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించకుండా నిరంతరం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలను ఆక్రమించకుండా తీసుకోవలసిన చర్యలను అధికారులు తప్పనిసరిగా తెలుసుకోవాలని, కుంటి సాకులు చెప్పరాదని తెలిపింది. 


సుల్తాన్‌పురిలోని నగర పాలక సంస్థ పార్కుల దురాక్రమణలపై సుల్తాన్‌పురి పోలీసులకు, ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని పిటిషనర్ ఆరోపించారు. 


Updated Date - 2020-10-13T19:44:08+05:30 IST