పట్టువీడని పన్నీర్‌ సెల్వం.. ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం..!

ABN , First Publish Date - 2020-10-03T16:23:34+05:30 IST

అన్నాడీఎంకేలో సీఎం సీటు కోసం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. సీఎం అభ్యర్థిపై నిర్ణయం..

పట్టువీడని పన్నీర్‌ సెల్వం.. ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం..!

చెన్నై : అన్నాడీఎంకేలో సీఎం సీటు కోసం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 6న అన్నాడీఎంకే అత్యవసర సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన శాసనసభ్యులంతా తప్పకుండా హాజరుకావాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్నాడీఎంకేలో సీఎం సీటు కోసం ఇరువర్గాలు పట్టుబిగించడంతో రాష్ట్ర రాజకీయాలు ఉన్నట్టుండి వేడెక్కాయి. గత 3 నెలలుగా వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే విషయమై అన్నాడీ ఎంకేలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రస్తుతం అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య వాగ్వాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఓ వర్గం ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడినే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తోంది. పార్టీలో అందరికంటే సీనియర్‌గా ఉన్న, మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఒ. పన్నీర్‌సెల్వంను ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధిస్తుందని మరో వర్గం చెబుతోంది. సీఎం అభ్యర్థి విషయమై మంత్రివర్గం కూడా రెండు వర్గాలుగా మారాయి. ఈ నెల 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో సీఎం అభ్యర్థి విషయమై ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం నడుమ తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. 


దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిని కనుకనే తనను ఆమె రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారని పన్నీర్‌సెల్వం ప్రకటించారు. వెంటనే ఎడప్పాడి బదులిస్తూ ఇరువురికీ సీఎం పదవి కట్టబెట్టింది జయలలిత సన్నిహితురాలు శశికళేనని తెలిపారు. అంతటితో ఆగకుండా సీఎంగా సమర్థవంతంగా పనిచేస్తున్న తనకు బదులు మరొకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ఎంపిక చేయగలుగుతారంటూ ప్రశ్నించారు. ఇలా ఇద్దరి మధ్య గంటకు పైగా వాదోప వాదాలు జరిగాయి. చివరకు సీనియర్‌ మంత్రులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ సమావేశం తర్వాత అన్నాడీఎంకే డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే విషయంగా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ప్రకటిస్తారని తెలిపారు. ఆ మరుసటి రోజు నుంచి పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో చర్చలు సాగిస్తున్నారు. ఎడప్పాడితో పాటు పాల్గొనాల్సిన కొన్ని కార్యక్రమాలకు పన్నీర్‌సెల్వం నగరంలో ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు. దీంతో పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి ఎడప్పాడిపై కినుక వహించారని భావించిన సీనియర్‌ మంత్రులు రాజీయత్నాలకు దిగారు. రెండు రోజులకు ముందు పన్నీర్‌సెల్వం ఇంట్లో  చర్చలు జరిపారు. ఇరువురూ వాదులాడుకుంటే పార్టీ ప్రతిష్ఠ దిగజారుతుందని, ఇద్దరు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.


మంత్రి ప్రకటనపై భగ్గుమన్న ఓపీఎస్‌...

రెండు రోజులపాటు పన్నీర్‌సెల్వం ఇంట్లో పార్టీ సీనియర్‌ నేతలు, మంత్రులు జరిపిన చర్చలతో ఆయన కాస్త శాంతించారు. అదే సమయంలో మంత్రి దిండుగల్‌ శీనివాసన్‌ ఉన్నట్టుండి మీడియా ఎదుట ప్రత్యక్షమై కాబోయే సీఎం ఎడప్పాడి అని ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలలో ఎడప్పాడికి మంచి ఇమేజ్‌ ఉందని, జయలలిత బాటలో సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారంటూ కొనియాడారు. మంత్రి ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే పన్నీర్‌సెల్వం మద్దతుదారుడైన జేసీడీ ప్రభాకరన్‌ మండిపడ్డారు. పార్టీ అధిష్ఠానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మంత్రి దిండుగల్‌ ప్రకటన చేయడం నిబంధనలకు వ్యతిరేకమని విరుచుకుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పన్నీర్‌సెల్వం కూడా మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిపై ఎడప్పాడితో కలిసి తాను ఈ నెల 7న ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాక ఎవరూ ఈ విషయమై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించారు.


విరక్తిలో ఓపీఎస్‌...

సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో తలెత్తిన తాజా పరిస్థితులను గమనించి పన్నీర్‌సెల్వం విరక్తి చెందారు. రెండు రోజులుగా ఆయన ముఖ్యమంత్రి ఎడప్పాడిని కలుసుకోలేదు. సీఎం పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమాలకు దూరమయ్యారు. అంతే కాకుండా ఐలాండ్‌ గ్రౌండ్స్‌లో ఈ-రిక్షాల ప్రారంభోత్సవ ఆహ్వానపత్రికలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పేరు లేకపోవడంతో ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రి డి.జయకుమార్‌ బదులిస్తూ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో పన్నీర్‌సెల్వం పేరును ముద్రించాల్సిన అవసరం లేదని, సచివాలయంలో జరిగే కార్యక్రమాల్లో తప్పకుండా ఆయన పేరును ముద్రిస్తున్నారని బదులిచ్చారు. అదే సమయంలో ఎడప్పాడివర్గంపై కినుక వహించిన పన్నీర్‌సెల్వం మనశ్శాంతి కోసం ఆలయాల సందర్శనకు బయలు దేరారు. పెరియపాళయంలోని భవానీ అమ్మవారి ఆలయాన్ని, సిరువాపురి వద్దనున్న సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయానికి వెళ్ళి  దైవదర్శనం చేసుకున్నారు. సాధారణంగా పన్నీర్‌సెల్వం దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు ఆలయాలకు వెళుతుం డేవారు. ఎడప్పాడికి వ్యతిరేకంగా జయ సమాధి వద్ద ధర్మపోరాటాన్ని ప్రారంభించడానికి ముందు కూడా పన్నీర్‌సెల్వం ఆలయాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం గురువారం ఆలయాలను సందర్శించడం అధికార పార్టీలో గుబులు రేపింది. ఉప ముఖ్యమంత్రి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారేమోనని అనుమానించారు. అయితే శుక్రవారం ఉన్నట్టుండి పన్నీర్‌సెల్వం గాంధీ జయంతి, కామరాజర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడితోపాటు పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మునుపటిలా మెలగలేదు. చిరునవ్వులు చిందించలేదు.


పన్నీర్‌ డిమాండ్లు...

సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీలో జరుగుతున్న విబేధాలు సమసిపోవాలంటూ తన డిమాండ్లలో ఏదైనా ఒకదానిని ఆమోదించాలని పన్నీర్‌సెల్వం చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే తాను ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా పార్టీలో 11 మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లను ఆమోదించకపోతే మరో కోరికను అంగీకరించాలని కూడా పన్నీర్‌సెల్వం చెప్పారు. వీలైనంత త్వరగా పార్టీ సర్వసభ్యమండలిని ఏర్పాటు చేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకోవాలని ఎడప్పాడి వర్గీయులకు ఆయన స్పష్టం చేశారు. పన్నీర్‌సెల్వం చేసిన మూడు డిమాండ్లపై  ఎడప్పాడి వర్గీయులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శక కమిటీ ఏర్పాటుకు ఎడప్పాడి మొదటి నుంచి అంగీకరించడం లేదని తెలిసినా అదే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావటం భావ్యం కాదని చెబుతున్నారు. సీఎం అభ్యర్థి ఎవరనేది శాసనసభ్యుల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని ఎడప్పాడి వర్గీయులు తెలిపారు. ఈ నెల 7న సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఇద్దరు కలిసి చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.


అత్యవసర సమావేశం...

సీఎం అభ్యర్థి గురించి ఈ నెల 7న అధికారిక ప్రకటన విడుదల కావడానికి ఒక రోజు ముందే అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశం జరుపనున్నట్లు శుక్రవారం ప్రకటన జారీ కాగానే పన్నీర్‌సెల్వం వర్గీయులు ఖంగుతిన్నారు. శాసనసభ్యులలో ముఖ్యమంత్రి ఎడప్పాడికే మెజారిటీ లభిస్తుందన్నది జగమెరిగిన సత్యం. శాసనసభ్యుల మెజారిటీ ప్రకారం కాబోయే సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పేరునే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే పన్నీర్‌సెల్వం వర్గీయులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. శాసనసభ్యుల మెజారిటీ అభిప్రాయం ప్రకారం, పార్టీ సీనియర్‌ నేతల సమష్టి నిర్ణయం ప్రకారం సీఎం అభ్యర్థిపై ఈ నెల 6నే ఓ నిర్ణయానికి రానున్నారు. మరుసటి రోజు సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని పార్టీ కార్యాలయంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం కలిసి ప్రకటించనున్నారు. ఏదిఏమైనప్పటికీ అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థిపైౖ జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Updated Date - 2020-10-03T16:23:34+05:30 IST