రైతులకు మద్దతుగా పానీపూరీ స్టాల్
ABN , First Publish Date - 2020-12-27T16:05:18+05:30 IST
నెల రోజులుగా రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దులు మారుమ్రోగిపోతున్నాయి. గడ్డకట్టే చలిలో..

న్యూఢిల్లీ: నెల రోజులుగా రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దులు మారుమ్రోగిపోతున్నాయి. గడ్డకట్టే చలిలో పోరాటం సాగిస్తున్న అన్నదాతలకు వివిధ రకాలుగా సాయమందుతోంది. ఇప్పుడు హరియాణకు చెందిన కొందరు ఉద్యోగులు పానీపూరీ స్టాల్స్‌తో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు ఎంతోమంది సాయం అందిస్తున్నారు. ఇదే రీతిలో హరియాణకు చెందిన ఏడుగురు అగ్నిమాపక సిబ్బంది వినూత్నంగా రైతులకు సాయం చేశారు. సింఘా సరిహద్దులో బైఠాయించిన రైతుల వద్దకు పానీపూరీల స్టాల్స్‌నే తీసుకువచ్చారు. అక్కడ రైతులందరికీ పానీపూరీలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఇలా రైతులకు పానీపూరీ పంపిణీ చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి ఓ నిరేపేద బాలుడు ప్రేరణగా నిలిచాడు. పానీపూరీలను ఉత్తరాదిలో గోల్ గప్పాలంటారు. అవి విక్రయించే ఓ స్టాల్ వద్ద ఒక బాలుడు నిరీక్షిస్తూ ఉండడాన్ని ఫైర్ సిబ్బంది గమనించారు. చాలాసేపు అక్కడే నిలబడి ఉండడంతో ఏం కావాలని అడిగారు. తనకు గోల్ గప్పాలు తినాలని ఉందని, అయితే తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. ఆ సమాధానం సిబ్బందిని కదిలించింది. ఏడుగురు ఫైర్ సిబ్బంది కలిసి అక్కడున్న పానీపూరీ స్టాల్‌ను రైతుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే వేడి వేడిగా తయారు చేసి రైతులకు పంపిణీ చేశారు.