జయరాజ్ కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-07-27T22:34:38+05:30 IST
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో పోలీసుల చిత్రహింసల కారణంగా మృతి చెందిన..

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో పోలీసుల చిత్రహింసల కారణంగా మృతి చెందిన జయరాజ్ కుటుంబానికి అండగా నిలవాలని సీఎం పళనిస్వామి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో.. జయరాజ్ కుమార్తెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని భావించారు. జయరాజ్ కుమార్తెను రాష్ట్ర రెవిన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తున్నట్లు సీఎం పళనిస్వామి సోమవారం ప్రకటించారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను ఆమెకు అందజేశారు. జయరాజ్, బెన్నిక్స్ అనే తండ్రీకొడుకులైన ఇద్దరిని తమిళనాడులోని తూతుక్కుడి జిల్లా సాత్తాన్‌కుళమ్ పోలీసులు ఇటీవల చిత్రహింసలు పెట్టి చంపిన ఘటన దేశాన్ని దిగ్ర్భాంతిలో ముంచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి.
లాక్‌డౌన్ సమయాన్ని మించి పావుగంట సేపు వారి దుకాణం తెరిచారనే కారణంతో పోలీసులు జూన్ 19న జయరాజ్‌ను, అతని కుమారుడు బెన్నిక్స్‌నూ అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌లో ఉంచి దారుణంగా హింసించారు. పోలీసు కస్టడీలో వారిద్దరూ మరణించడంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఉదంతంపై దర్యాప్తు సాగుతోంది. అయితే సంఘటన జరిగిన రోజున పోలీస్ స్టేషన్ సీసీ టీవీల దృశ్యాలు లేవు. కానీ ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం మేజిస్ట్రేట్‌కు జరిగిందేమిటో పూసగుచ్చినట్టు వివరించారు. ఈ కస్టోడియల్ డెత్ కేసులో... పోలీసు సిబ్బందిపై చర్యలతో పాటు హత్యా నేరం నమోదు కావడానికి ఆమె సాక్ష్యమే కీలక ఆధారంగా నిలిచింది.