సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ఏకగ్రీవం

ABN , First Publish Date - 2020-10-08T07:36:08+05:30 IST

అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. చెన్నైలో బుధవారం జరిగిన పార్టీనేతలు, మంత్రుల సమావేశంలో పార్టీ స మన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు...

సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ఏకగ్రీవం

  • రేసు నుంచి తప్పుకొన్న పన్నీర్‌సెల్వం  


చెన్నై, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. చెన్నైలో బుధవారం జరిగిన పార్టీనేతలు, మంత్రుల సమావేశంలో పార్టీ స మన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. సీఎం అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్న పన్నీర్‌సెల్వం పట్టుబట్టి పార్టీ లో 11మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేసుకోగలిగారు.


బుధవారం నాటి పరిణామాలతో సీఎం అభ్యర్థి ఎంపికపై 52 రోజులపాటు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వర్గాల నడుమ సాగిన వివాదాలకు తెరపడింది. గత ఆగస్టు 15న కాబోయే ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అంటూ ఆయన అభిమానులు ముద్రించిన పోస్టర్‌ కారణంగా పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం నడుమ విబేధాలు చోటుచేసుకున్నాయి. గత సెప్టెం బరు 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో సీఎం అభ్యర్థిగా తామే అర్హులమంటూ ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వాదులాడుకోవ డంతో పార్టీ నేతలు, సీనియర్‌ మంత్రులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆ తర్వాత సీనియర్‌ మంత్రులు, పార్టీ నేతలు ఇరువురి మధ్య రాజీ కుదిర్చేం దుకు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. ఇరువురి నివాసగృహాలలోనూ వీరు పలు విడతలుగా జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. సీఎం సీటు కో సం ఇరువురూ పోటీపడితే పార్టీ ప్రతిష్ఠ దిగజారుతుందని, అసెంబ్లీ ఎన్ని కల్లో అందరూ ఐకమత్యంగా ఉంటే గెలవగలమని మంత్రులు పన్నీర్‌సెల్వం కు హితవు చెప్పారు.


చివరకు మూడేళ్లుగా పన్నీర్‌సెల్వం కోరుతున్న మార్గద ర్శక కమిటీని ఏర్పాటు చేయిస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో పన్నీర్‌ సెల్వం సీఎం అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్నారు.  బుధవారం వేలాదిమంది పార్టీ కార్యకర్తల సందడి నడుమ పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి, మంత్రులు సమావేశమయ్యారు. తొలుత పన్నీర్‌సెల్వం పాత ప్రతిపాదన మేరకు పార్టీ లో 11 మందితో మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేస్తున్నటు పళని స్వామి ప్రకటించారు. ఈ మార్గదర్శక కమిటీలో మంత్రులు దిండుగల్‌ శీనివాసన్‌, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్‌, సీవీ షణ్ముగం, ఆర్‌. కామరాజ్‌, మాజీ శాసనసభ్యుడు జీసీడీ ప్రభాకరన్‌, మాజీ ఎంపీ పీహెచ్‌ మనోజ్‌పాండ్యన్‌, మాజీ మంత్రి మోహన్‌, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్‌, చోళవందాన్‌ శాసనసభ్యుడు మాణిక్కం సభ్యులుగా ఉంటారని  తెలిపారు. ఆ తర్వాత  వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయనున్న ఎడప్పాడి పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పన్నీర్‌సెల్వం ప్రకటించారు. 


Updated Date - 2020-10-08T07:36:08+05:30 IST