భారత దౌత్యాధికారికి పాక్ సమన్లు.. భారత్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే..!

ABN , First Publish Date - 2020-11-22T05:28:52+05:30 IST

నగ్రోటా ఘటనపై పాకిస్తాన్ దౌత్యాధికారికి భారత్ సమన్లు ఇచ్చిన కొద్ది గంటలకే పాకిస్తాన్ సైతం అక్కడి భారత దౌత్యవేత్తకు సమన్లు ...

భారత దౌత్యాధికారికి పాక్ సమన్లు.. భారత్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే..!

ఇస్లామాబాద్: నగ్రోటా ఘటనపై పాకిస్తాన్ దౌత్యాధికారికి భారత్ సమన్లు ఇచ్చిన కొద్ది గంటలకే పాకిస్తాన్ సైతం అక్కడి భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కుట్రపన్నిందంటూ భారత్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ దాయాది దేశం బుకాయించింది. పాకిస్తాన్ భూభాగంగలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దనీ... వెంటనే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారత్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ చెప్పుకొచ్చింది. కాగా దీనికి ముందు భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ... ‘‘పాకిస్తాన్ హైకమిషన్ దౌత్య వ్యవహారాల చీఫ్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఉగ్రదాడులకు కుట్ర పన్నడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే జైషే కుట్రకు చెక్ పెట్టగలిగాం...’’ అని పేర్కొంది. ఉగ్రవాదాన్ని అంతమొందించి దేశ భద్రత కోసం అవసరమైన ఎలాంటి చర్యలకైనా భారత్ కట్టుబడి ఉంటుందని స్పష్టంచేసింది. గురువారం ఉదయం నగ్రోటాలో ఓ ట్రక్కులో నక్కిన నలుగురు జైషే ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ అనంతరం పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Read more