సిక్కు యువతను పాకిస్థాన్ సామూహికంగా చంపుతోంది : సంత్ దాదూవాలా

ABN , First Publish Date - 2020-07-15T21:02:43+05:30 IST

పంజాబ్, హర్యానాల్లోని సిక్కు యువతను పాకిస్థాన్ సామూహికంగా

సిక్కు యువతను పాకిస్థాన్ సామూహికంగా చంపుతోంది : సంత్ దాదూవాలా

న్యూఢిల్లీ : పంజాబ్, హర్యానాల్లోని సిక్కు యువతను పాకిస్థాన్ సామూహికంగా చంపుతోందని హర్యానా గురుద్వారా ప్రబంధక్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు సంత్ బాబా బల్జీత్ సింగ్ దాదూవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల గుండా భారత దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ, సిక్కు యువతను హతమారుస్తోందని దుయ్యబట్టారు. 


దాదూవాలా ఇటీవలే హర్యానా గురుద్వారా ప్రబంధక్ కమిటీ తాత్కాలిక అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తన ప్రధాన లక్ష్యం పంజాబ్, హర్యానాల్లోని సిక్కు యువత విలువైన జీవితాలను కాపాడటమని తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి సిక్కు, ఇతర మతాల యువతకు అవగాహన కల్పించి, పాకిస్థాన్ సరిహద్దుల్లోని యువతను కాపాడటానికి తాను ప్రాధాన్యమిస్తానని చెప్పారు. 


సరిహద్దుల ఆవలి నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాలా పెద్ద సమస్య అని చెప్పారు. ఇది మన యువతను సామూహికంగా హతమార్చడం కోసం నిర్వహిస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నమని తెలిపారు. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. 


మన యువత శారీరకంగా, మానసికంగా అస్వస్థులవుతున్నారని, ఈ పరిస్థితిని మార్చేందుకు తాము ఇతర సాంఘిక సంక్షేమ సంఘాలతో కలిసి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తామని తెలిపారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేస్తామన్నారు. తాను ఇదే లక్ష్యంతో గత 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని, ప్రస్తుతం తనకు లభించిన అదనపు బాధ్యతతో మరింత విస్తృతంగా కృషి చేస్తానని చెప్పారు. 


Updated Date - 2020-07-15T21:02:43+05:30 IST