భారత దౌత్యాధికారికి పాక్ సమన్లు

ABN , First Publish Date - 2020-05-18T22:07:28+05:30 IST

భారత హైకమిషన్‌కు చెందిన ఓ సీనియర్ దౌత్యాధికారికి పాకిస్తాన్ ఇవాళ సమన్లు జారీ చేసింది...

భారత దౌత్యాధికారికి పాక్ సమన్లు

ఇస్తామాబాద్: భారత హైకమిషన్‌కు చెందిన ఓ సీనియర్ దౌత్యాధికారికి పాకిస్తాన్ ఇవాళ సమన్లు జారీ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి భారత భద్రతా బలగాలు ‘‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని’’ ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం కుయ్‌రట్టా సెక్టార్‌లో భారత బలగాలు ‘‘విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయనీ’’.. ఈ కాల్పుల్లో తమ దేశానికి చెందిన 37 ఏళ్ల ఓ పౌరుడు గాయపడ్డాడని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఆరోపించింది. ‘‘నియంత్రణ రేఖ వద్ద భారత భద్రతా బలగాలు నిత్యం పౌరుల ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నాయి. 2020లో భారత్ ఇప్పటి వరకు 1,081 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది’’ అని దాయాది దేశం ఆరోపించింది. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ గౌవరించాలంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి కరోనా కల్లోలం మధ్య కూడా పాకిస్తాన్ ఇటీవల తరచూ కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. తీరా ఇప్పుడు అదే దేశం భారత్‌పై ఆరోపణలు గుప్పిస్తుండడం గమనార్హం. 

Updated Date - 2020-05-18T22:07:28+05:30 IST