క్రిస్మస్ నాటికి బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ?!
ABN , First Publish Date - 2020-10-04T07:32:58+05:30 IST
ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడు నెలల్లోనే బ్రిటన్‌లో అందుబాటులోకి రావచ్చంటూ ప్రఖ్యాత బ్రిటన్ వార్తాపత్రిక ‘ది టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. క్రిస్మస్ పండుగకు ముందే దానికి నియంత్రణ సంస్థల అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది...
లండన్, అక్టోబరు 3 : ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడు నెలల్లోనే బ్రిటన్‌లో అందుబాటులోకి రావచ్చంటూ ప్రఖ్యాత బ్రిటన్ వార్తాపత్రిక ‘ది టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. క్రిస్మస్ పండుగకు ముందే దానికి నియంత్రణ సంస్థల అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ (ఈఎంఏ) ఆ వ్యాక్సిన్‌తో ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించే ప్రక్రియను ప్రారంభించడాన్ని ప్రస్తావించింది.
పిల్లలు మినహా వయోజనులు అందరికీ ఆరు నెలల్లోగా ఒక డోసు వ్యాక్సిన్‌ను అందించాలనే కృత నిశ్చయంతో భారీ టీకా కార్యక్రమానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని కథనంలో పేర్కొంది. పెద్దసంఖ్యలో ఆరోగ్య సిబ్బందిని సమీకరించడంతో పాటు సాయుధ దళాల సేవలను కూడా వాడుకోనున్నట్లు తెలిపింది. అయితే అందరికీ వ్యాక్సిన్ అందేందుకు తొమ్మిది నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, 10 కోట్ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ డోసుల కోసం ఆస్ట్రాజెనెకాతో బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.