‘ఆక్స్‌ఫర్డ్‌’ వ్యాక్సిన్‌తో ప్రయోగాలకు డీసీజీఐకి ఎస్‌ఐఐ దరఖాస్తు

ABN , First Publish Date - 2020-07-27T07:36:39+05:30 IST

‘ఆక్స్‌ఫర్డ్‌’ వ్యాక్సిన్‌తో ప్రయోగాలకు డీసీజీఐకి ఎస్‌ఐఐ దరఖాస్తు

‘ఆక్స్‌ఫర్డ్‌’ వ్యాక్సిన్‌తో ప్రయోగాలకు డీసీజీఐకి ఎస్‌ఐఐ దరఖాస్తు

  • 1600 మందిపై రెండు, మూడు దశల ట్రయల్స్‌


న్యూఢిల్లీ, జూలై 26: ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ వ్యాక్సిన్‌తో భారత్‌లో రెండు, మూడు దశల ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) దరఖాస్తు చేసిందని అధికారవర్గాలు శనివారం ఓ వార్తాసంస్థకు తెలిపాయి. ఈమేరకు శుక్రవారం రోజే ఎస్‌ఐఐ దరఖాస్తును సమర్పించిందని పేర్కొన్నాయి. ప్రయోగాల్లో భాగంగా 18 ఏళ్లకు పైబడిన దాదాపు 1,600 మంది వలంటీర్లపై ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని ఆ దరఖాస్తులో ఎస్‌ఐఐ ప్రస్తావించిందని వెల్లడించాయి. ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ స్టడీ, అబ్జర్వర్‌ బ్లైండ్‌ అనే రెండు పద్ధతుల్లో ప్రయోగ పరీక్షలు జరుగుతాయని ప్రస్తావించినట్లు చెప్పాయి. ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ స్టడీలో.. ప్రయోగాలు జరపనున్న వలంటీర్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపు వారికి కరోనా వ్యాక్సిన్‌ను.. మరో గ్రూపు వారికి డమ్మీ (ప్లేస్‌బో) చికిత్సను అందిస్తారు. నిర్దిష్ట కాలపరిమితి తర్వాత వచ్చే ఆరోగ్య ఫలితాలను  పోల్చి చూసి ఔషధం పనితీరుపై ఓ నిర్ధారణకు వస్తారు. కాగా, డీసీజీఐ నుంచి అనుమతులు లభించగానే ఆగస్టు నుంచే ఎస్‌ఐఐ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 


Updated Date - 2020-07-27T07:36:39+05:30 IST