73.5 లక్షల కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-25T07:11:03+05:30 IST

కరోనా పరీక్షలు వేగం పుంజుకున్నాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) పేర్కొంది. మంగళవారం(జూన్‌ 23) నాటికి రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌- పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ-పీసీఆర్‌) పరిజ్ఞానంతో దేశంలో 73.5 లక్షల కరోనా పరీక్షలు జరిగాయని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు...

73.5 లక్షల కరోనా పరీక్షలు

  • మంగళవారం ఒక్కరోజే 2.15 లక్షలు 
  • 1,000వ టెస్టింగ్‌ ల్యాబ్‌కు ఆమోదం 
  • కరోనా తరహా లక్షణాలు ఉన్నవారందరికీ 
  • పరీక్షలు శ్రేయస్కరం : ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 24 : కరోనా పరీక్షలు వేగం పుంజుకున్నాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) పేర్కొంది. మంగళవారం(జూన్‌ 23) నాటికి రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌- పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ-పీసీఆర్‌) పరిజ్ఞానంతో దేశంలో 73.5 లక్షల కరోనా పరీక్షలు జరిగాయని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. ఒక్క మంగళవారమే 2.15 లక్షల నమూనాలను పరీక్షించగా, అంతకుముందు రోజు(సోమవారం) 1.87 లక్షల నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు. టెస్టింగ్‌, ట్రాకింగ్‌,  ట్రీటింగ్‌(3టీ) లక్ష్యంలో భాగంగా టెస్టుల సంఖ్యను పెంచడం ద్వారా కరోనాపై రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతిరోజు సగటున 1.9 లక్షల నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించే స్థితికి భారత్‌ పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున 1,000వ కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌కు అనుమతి ఇచ్చామని బలరాం భార్గవ తెలిపారు.


దేశానికి మారుమూలన 18,000 అడుగుల ఎత్తులో ఉండే లేహ్‌ ప్రాంతంలోనూ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా తరహా లక్షణాలు బయటపడే వారందరికీ కొవిడ్‌ పరీక్షలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందంటూ ఐసీఎంఆర్‌ తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో సూచించింది. ఆస్పత్రుల్లో చేరే రోగుల్లో ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు ఉన్నవారికి..  ఇవే లక్షణాలతో హాట్‌స్పాట్‌లు, కట్టడి ప్రాంతాల్లోని వారికి.. ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు వంటి వారికీ టెస్టులు చేయడం శ్రేయస్కరమని పేర్కొంది. 


Updated Date - 2020-06-25T07:11:03+05:30 IST