ఉత్తరాఖండ్ తిరిగి వెళ్లేందుకు 1.7 లక్షల మంది పేర్లు నమోదు
ABN , First Publish Date - 2020-05-10T01:55:55+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 1.7 లక్షల మంది ఉత్తరాఖండ్ వాసులు..
డెహ్రాడూన్: లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 1.7 లక్షల మంది ఉత్తరాఖండ్ వాసులు, వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు ఆన్‌లైన్లో నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 23,794 మందిని స్వస్థలాలకు తీసుకువచ్చినట్టు తెలిపింది. అత్యధికంగా హర్యానా నుంచి 11,482 మంది స్వస్థలాలకు తిరిగి రాగా... ఛండీగడ్ నుంచి 4,838 మంది, ఉత్తర ప్రదేశ్ నుంచి 3,526 మంది, రాజస్థాన్ నుంచి 2,409 మంది, ఢిల్లీ నుంచి 482 మంది, పంజాబ్ నుంచి 327 మంది, గుజరాత్ నుంచి 319 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 411 మంది రాష్ట్రానికి తిరిగి వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కర్నాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా ప్రజలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు 21,717 మంది రిజిస్టర్ చేసుకున్నారనీ.. వీరిలో ఇప్పటి వరకు 6,378 మందిని ఆయా రాష్ట్రాలకు పంపించామని తెలిపింది.