ఎలాంటి సంక్షోభాలకు దేశం లొంగదు: సోనియా

ABN , First Publish Date - 2020-03-22T02:06:47+05:30 IST

ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనే శక్తి దేశానికి ఉందని, దేనికీ తలవంచదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రజలు..

ఎలాంటి సంక్షోభాలకు దేశం లొంగదు: సోనియా

న్యూఢిల్లీ: ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనే శక్తి దేశానికి ఉందని, దేనికీ తలవంచదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రజలు భయాందోళనలు చెందవద్దని ఓ ప్రకటనలో కోరారు. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ఆర్థిక పతనం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం సమగ్ర, రంగాలవారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.


కరోనా వైరస్ పరీక్షా కేంద్రాల సంఖ్య దేశవ్యాప్తంగా పెంచాలని, ఆసుపత్రులు, వైద్య సదుపాయాల అందుబాటుకు సంబంధించిన సమాచారాన్ని పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీని సోనియాగాంధీ కోరారు. వైరస్‌తో పోరాటానికి సౌకర్యాలను పెంచుతూ, ఇందుకు అవసరమైన ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు జరపాలని సూచించారు.


'అసాధారణమైన పరిస్థితులు తలెత్తినప్పుడు అసాధారణ చర్యలే చేపట్టాలి. అత్యవసర పన్ను విరామాలు, వడ్డీల తగ్గింపు, బకాయిల వాయిదాలు సహా పలు సమగ్ర, రంగాలవారీ ఉపశమన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. వేతనజీవుల విషయంలో ఈఎంఐలను వాయిదా వేసే విషయాన్ని కూడా ప్రభుత్వం, ఆర్బీఐ తప్పనిసరిగా పరిశీలించాలి' అని సోనియాగాంధీ సూచించారు.

Updated Date - 2020-03-22T02:06:47+05:30 IST