ఎంఎస్‌పీపై రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవపట్టిస్తున్నాయి : కేంద్ర మంత్రి తోమర్

ABN , First Publish Date - 2020-09-24T21:43:50+05:30 IST

కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి గట్టి భరోసా ఇచ్చారు.

ఎంఎస్‌పీపై రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవపట్టిస్తున్నాయి : కేంద్ర మంత్రి తోమర్

న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి గట్టి భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానాన్ని తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా తప్పు అని చెప్పారు. పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లుల్లో ఎంఎస్‌పీ లేకపోయినప్పటికీ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అసలు ఎంఎస్‌పీ గతంలో సైతం ఎన్నడూ చట్టంలో లేదన్నారు. 


తప్పనిసరి నిబంధనగా ఎంఎస్‌పీ చట్టంలో ఎప్పుడూ లేదని, నూతన వ్యవసాయ బిల్లుల్లో దీనిని చేర్చకపోవడానికి అదే కారణమని తోమర్ వివరించారు. 50 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంఎస్‌పీని చట్టంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 


ఎంఎస్‌పీ ఎప్పుడైనా చట్టంలో ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 50 ఏళ్లపాటు దేశాన్ని పరిపాలించిందని, ఎంఎస్‌పీని చట్టంలో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. విమర్శించడానికి ఏదీ దొరకకపోవడం వల్ల దీనిని ఓ సమస్యగా మార్చిందని చెప్పారు. కాంగ్రెస్‌తోపాటు కొన్ని ప్రతిపక్షాలు స్వప్రయోజనాల కోసం యాగీ చేస్తున్నాయని, ఆ పార్టీలు ఇటువంటి సంస్కరణలను తేలేకపోయాయని దుయ్యబట్టారు. 


మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఇటువంటి సంస్కరణలు తేవాలని అనుకున్నారని, అయితే కొందరు ఒత్తిడి తేవడం వల్ల వారికి అది సాధ్యపడలేదని చెప్పారు. 


ఎంఎస్‌పీ అనేది ఎప్పుడూ భారత ప్రభుత్వ పరిపాలనాపరమైన నిర్ణయమని, ఇది అదే విధంగా కొనసాగుతుందని వివరించారు. 


పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించవలసి ఉంది. ఆమోదం పొందిన బిల్లులు :

- ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, 2020

- ఫార్మర్స్ (ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యురెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు, 2020

- ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2020


Updated Date - 2020-09-24T21:43:50+05:30 IST