ప్రధాని మాటలకు పెడర్థం తీస్తున్నారు

ABN , First Publish Date - 2020-06-21T06:45:37+05:30 IST

అఖిలపక్ష సమావేశంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. ఎవరూ భారత భూభాగంలోకి ప్రవేశించలేదని, ఏ సైనిక పోస్టునూ ఆక్రమించలేదని లద్దాఖ్‌ ఘటనను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు...

ప్రధాని మాటలకు పెడర్థం తీస్తున్నారు

  • చైనా సైనికులు హద్దులు దాటారు
  • భారత సైనికులు తిప్పికొట్టారు
  • మోదీ ప్రసంగంలో అదే ఉంది
  • ప్రధాని కార్యాలయం వివరణ
  • నిజాలు దాచిపెడ్తున్నారు: విపక్షం

న్యూఢిల్లీ, జూన్‌ 20: అఖిలపక్ష సమావేశంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. ఎవరూ భారత భూభాగంలోకి ప్రవేశించలేదని, ఏ సైనిక పోస్టునూ ఆక్రమించలేదని లద్దాఖ్‌ ఘటనను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ లోపల చైనా సైనికులెవరూ లేరని ప్రకటించడం ద్వారా మోదీ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. చైనా సైనికులెవరూ సరిహద్దులు దాటి రాకపోతే 20 మంది సైనికులను ఎలా కోల్పోయామో వివరించాలని డిమాండ్‌ చేశాయి. దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడంతో ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని వ్యాఖ్యలకు కొందరు దురుద్దేశ పూరితంగా తప్పుడు అర్థాన్ని తీస్తున్నారని పీఎంవో ఆరోపించింది. భారతీయ సైనికుల సాహసోపేత పోరాటం వల్లే ప్రస్తు తం సరిహద్దుల లోపల చైనా సైనికులు లేరనే ఉద్దేశంలో ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని పీఎంవో వివరణ ఇచ్చింది. ‘‘అక్కడ మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. మనకు చెందిన ఏ పోస్టూ వేరెవరి కబ్జాలోకి వెళ్లలేదు’’ అని శుక్రవారం రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మాట్లాడినట్లు తెలిపింది. ‘‘అక్కడ చైనా కుట్రలను తిప్పికొట్టిన మన సాయుధ బలగాల ధైర్యం, దేశభక్తినిప్రధానమంత్రి గొప్పగా అంజలి ఘటించారు. వాస్తవాధీన రేఖ లోపల చైనీయులు లేరన్న ప్రధాని వ్యాఖ్య మన సైనికుల ధైర్య సాహసాల ప్రదర్శన అనంతర పరిస్థితిని ఉద్దేశించి చేసినది’’ అని చెప్పింది. 


చైనా భారత భూభాగంలోకి చొరబడిన విషయం మోదీ ప్రసంగంలో ఉందని ప్రస్తావించింది. గల్వాన్‌ దగ్గర జూన్‌ 15న వాస్తవాధీన రేఖకు కాస్త ఇవతల చైనా సైనికులు స్థావరాలను ఏర్పాటు చేస్తుంటే భారత సైనికులు అడ్డుకున్నారని, అయినా వాళ్లు లెక్క చేయలేదని మోదీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. 16వ బీహార్‌ రెజిమెంట్‌ సైనికుల ప్రాణత్యాగం చైనా సైనికుల ఆక్రమణ కుట్రను భగ్నం చేసిందని వ్యాఖ్యానించింది. పీఎంవో వివరణపైనా విపక్షాలు భగ్గుమన్నాయి. నిజాన్ని దాచిపెట్టేందుకు మోదీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరి ఏంటో, మోదీ వైఖరి ఏంటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని ఏదైనా మాట్లాడేటప్పుడు మానసికంగా సిద్ధం కావాలని సీపీఐ నేత రాజా అన్నారు. పీఎంవో వివరణతో మరిన్ని ప్రశ్నలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-06-21T06:45:37+05:30 IST