ముంబై ధరావీలో కొత్త కరోనా కేసులు రెండే..!

ABN , First Publish Date - 2020-07-05T15:11:26+05:30 IST

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధరావీ మురికి వాడ కరోనా మహమ్మారిపై క్రమంగా పైచేయి సాధిస్తోంది.

ముంబై ధరావీలో కొత్త కరోనా కేసులు రెండే..!

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధరావీ మురికి వాడ కరోనా మహమ్మారిపై క్రమంగా పైచేయి సాధిస్తోంది. శనివారం నాడు అక్కడ కేవలం 2 కరోనా కేసులు వెలుగు చూసాయని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,311కి చేరుకుంది.


ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికి వాడ ధరావీ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ కరోనా వ్యాపిస్తే కల్లోలం చెలరేగుతుందని తొలుత ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందారు. అయితే కరోనాపై ధరావీ క్రమంగా పైచేయి సాధిస్తోంది. ఏప్రిల్ తొలి వారం తరువాత.. రోజువారి కేసులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. మరోవైపు.. అక్కడ కొత్తగా కరోనా మరణాలు ఏమైనా సంభవించాయా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. గత కొంత కాలంగా మున్సిపల్ కార్పొరేషన్ ఈ సమాచారం ఇవ్వడం నిలిపివేసినట్టు తెలుస్తోంది.


దాదాపు 2.5 చదరుపు కిమీల మేర విస్తరించిన ధరావీలో 6.5 లక్షల మంది నివసిస్తుంటారు. తాజా లెక్కల ప్రకారం అక్కడ 519 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మరో 1704 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ధరావీలో కేసుల రెట్టింపయ్యే వ్యవధి ప్రస్తుతం 140 రోజులుగా ఉందని అధికారులు తెలిపారు. కేసుల పెరుగుదల రేటు 0.55 శాతంగా ఉందన్నారు.

Updated Date - 2020-07-05T15:11:26+05:30 IST