ఆ ఐదు దేశాల్లోనే 62 శాతం కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-04-07T20:53:19+05:30 IST

యూఎస్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్.. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో సుస్థిర స్థానం సాధించుకున్న దేశాలు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది.

ఆ ఐదు దేశాల్లోనే 62 శాతం కరోనా కేసులు!

న్యూఢిల్లీ: యూఎస్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్.. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో సుస్థిర స్థానం సాధించుకున్న దేశాలు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ దేశాల్లోని ప్రజలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. దీనంతటికీ కారణం కరోనా మహమ్మారే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. ముఖ్యంగా యూఎస్, యూరప్‌లోని దేశాల్లో విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 13.5లక్షల కరోనా కేసులు నమోదయితే వీటిలో 62శాతం పైన పేర్కొన్న దేశాల్లోనే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటిలో ఒక్క అమెరికాలోనే సుమారు 3.7లక్షల కరోనా బాధితులున్నారు. ఆ తర్వాత 1.36లక్షల కరోనా కేసులతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలోని ఇటలీలో 1.32లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. జర్మనీలో 1.03లక్షల కేసులు, ఫ్రాన్స్‌లో సుమారు 99వేల కరోనా కేసులు రికార్డయ్యాయి. అయితే కరోనా మరణాల్లో మాత్రం ఇటలీ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ 16,523మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 13,798 మరణాలతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత 10,943మంది కరోనా మృతులతో అమెరికా మూడోస్థానంలో ఉంది. 8,911 కరోనా మృతులతో ఫ్రాన్స్ నాలుగు, 5,373 మరణాలతో బ్రిటన్ ఐదు స్థానాల్లో నిలిచాయి. 3,739 కరోనా మరణాలతో ఇరాన్ ఆరో స్థానంలో ఉంది.


ఇందులో గమనించాల్సిన విషయమేంటంటే.. అసలు ఈ కొత్తరకం కరోనా వైరస్‌కు పుట్టిల్లయిన చైనా ఈ జాబితాలో నెమ్మదిగా దిగువకు చేరుకుంటోంది. అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో ఆరోస్థానంలో నిలిచిన చైనా.. కరోనా మరణాల జాబితాలో ఏడో స్థానంలో ఉంది. ఈ మహమ్మారి నుంచి ఎక్కువ మంది కోలుకుంది మాత్రం చైనాలోనే. ఇక్కడ 77,410 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.

Updated Date - 2020-04-07T20:53:19+05:30 IST