8 రోజుల్లోనే లక్ష కేసులు
ABN , First Publish Date - 2020-06-22T06:43:20+05:30 IST
దేశంలో కరోనా ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. గత 8 రోజుల్లోనే లక్ష మంది వైరస్ బారినపడ్డారు. తాజాగా అత్యధికంగా 15,413 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో రికార్డయిన వివరాలను...

- దేశంలో కరోనా ఉధృతి తీరిది
- కొత్తగా మరో 15,413 మందికి వైరస్
- ఢిల్లీలో మూడో రోజూ 3 వేలపైగా కేసులు
- ఆరోగ్య మంత్రి వైద్యానికి ప్రత్యేక బృందం
- జైళ్లలో ఐసోలేషన్ వార్డులు, ర్యాపిడ్ టెస్టులు
- ప్రభుత్వానికి హైకోర్టు జడ్జి కమిటీ సూచన
న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలో కరోనా ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. గత 8 రోజుల్లోనే లక్ష మంది వైరస్ బారినపడ్డారు. తాజాగా అత్యధికంగా 15,413 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో రికార్డయిన వివరాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది. వైర్‌సతో మరో 306 మంది చనిపోయినట్లు ప్రకటించింది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. వంద నుంచి లక్ష కేసులకు 64 రోజులు పడితే.. ఆపై 15 రోజుల్లోనే రెండు లక్షలకు, పది రోజుల్లోనే 3 లక్షలకు చేరాయి. ఇప్పటివరకు 2,27,755 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 55.48 శాతానికి చేరిందని పేర్కొంది. ఇది క్రితం రోజుతో పోలిస్తే 1.35 శాతం అధికం. భారత్‌లో కేసుల సంఖ్య పట్ల హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ ఝా ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ కరోనా విజృంభిస్తే కేసులు, మరణాల సంఖ్యలో భారీ పెరుగుదల ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో మళ్లీ..
మహారాష్ట్రలోనే కరోనా తీవ్రంగా ఉందనుకుంటే.. ఢిల్లీలోనూ పరిస్థితి విషమంగా మారుతోంది. దేశ రాజధానిలో వరుసగా మూడో రోజూ 3 వేలపైగా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు మెరుగైన వైద్యం అందిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని జైళ్లలో తొలి కొవిడ్ మరణం నమోదైంది. మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ (62) వైర్‌సతో చనిపోయాడు. ఖైదీలు, సిబ్బంది వైర్‌సకు గురవుతుండటంతో జైళ్లలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని, ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని హైకోర్టు జడ్జి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎ్‌సఎఫ్) జవాను (41) కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, సీఐఎ్‌సఎఫ్ సహా కేంద్ర పారా మిలటరీ దళాలైన సీఆర్పీఎఫ్, బీఎ్‌సఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎ్‌సబీలలో వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 18కి చేరింది. మేఘాలయ రాత్రి కర్ఫ్యూతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధాన్ని ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నై సహా పరిసర మూడు జిల్లాల్లో ఆదివారం సంపూర్ణలాక్‌డౌన్ అమలు చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈనెల 19 నుంచి 30 వరకు ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మధ్యలోని రెండు ఆదివారాలు (21, 28) కర్ఫ్యూ ప్రకటించారు. కాగా కరోనా దెబ్బకు రైల్వే ఆదాయానికి గండిపడింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 58 శాతానికి పడిపోయింది. దీంతో ఖర్చు లు తగ్గించుకునే మార్గాలపై రైల్వే దృష్టిసారించింది.
ఒకే రోజు 53మంది మృతి
చెన్నై: తమిళనాడులో కరోనాతో ఒకే రోజు 53 మంది చనిపో యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వరకు 29,963 మందికి పరీక్షలు నిర్వహించగా 2,532 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 59,377కు చేరింది. చెన్నైలో తాజాగా 1,493 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసు ల సంఖ్య 41,172కి పెరిగింది.
కర్ణాటక ‘ప్రైవేటు’లో ఉచిత వైద్యం
కరోనా రోగులకు 483 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. బీపీఎల్ కార్డుదారులకు ‘సువర్ణ ఆరోగ్య సురక్షా ట్రస్ట్’ ద్వారా ఈ మేరకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా దీనిని అమలు చేయనున్నారు. కర్ణాటకలో ఆదివారం 453 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదుగురు మృతి చెందారు.
జూలై 1 నాటికి ఆరు లక్షల కేసులు
భారత్‌లో జూలై 1 నాటికి కరోనా కేసులు 6 లక్షలకు చేరతాయని అమెరికాకు చెందిన మిషిగన్ వర్సిటీ ప్రొఫెసర్ భ్రమర ముఖర్జీ అంచనా వేశారు. ‘భారత్ జనాభాలో ఇప్పటివరకు 60 లక్షల మంది (0.05 శాతం)కి మాత్రమే పరీక్షలు చేశారు. మిగతా ప్రపంచ జనాభాలో 4 శాతం మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ లెక్కన చూస్తే మనం ఇంకా 5.4 కోట్ల మందికి పరీక్షలు చేయాలి. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ. కాబట్టి ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి’ అని ఆమె సూచించారు.