ఢిల్లీలో ప్రతి ముగ్గురిలో ఒకరికి యాంటీబాడీలు
ABN , First Publish Date - 2020-09-18T07:30:08+05:30 IST
ఈ నెల మొదటి వారంలో చేపట్టిన సీరో మూడో సర్వే ప్రాథమిక ఫలితాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ముగ్గురిలో ఒకరి(33 శాతం)కి యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది...

- సీరో మూడో సర్వేలో స్పష్టం
- కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తి
- కరోనాతో కన్నుమూత
- రాష్ట్రంలో 1,000 కరోనా మరణాలు
- కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు
- వైరస్‌తో మరో 9 మంది మృతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఈ నెల మొదటి వారంలో చేపట్టిన సీరో మూడో సర్వే ప్రాథమిక ఫలితాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ముగ్గురిలో ఒకరి(33 శాతం)కి యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో ప్రజలను వయసులవారీగా మూడు విభాగాలుగా విభజించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 17 వేల శాంపిళ్లను సేకరించారు. 18-49 ఏళ్ల మధ్య వయసు వారి నుంచే ఎక్కువ నమూనాలు సేకరించారు. ఈ ఫలితాలను వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఢిల్లీ జనాభా 2 కోట్లు. తాజా సర్వే ప్రకారం చూస్తే 66 లక్షల మంది వైరస్ బారినపడ్డట్లు స్పష్టమవుతోంది. ఎక్కువ శాతం మందిలో కరోనా యాంటీబాడీలున్నట్లు తేలడం.. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తున్న సంకేతంగా భావిస్తున్నారు. అక్టోబరు 1 నుంచి సీరో నాలుగో సర్వే నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ ఆఖర్లో చేపట్టి జూలై మొదటివారం వరకు కొనసాగిన తొలి సీరో సర్వేలో 21 వేల శాంపిళ్లను సేకరించారు. నాడు 23.4 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు ప్రకటించారు. ఆగస్టు తొలివారం చేసిన రెండో సీరో సర్వేలో 15 వేల నమూనాలను సేకరించగా.. 29.1 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు తేలింది. మూడో సర్వేకు వచ్చేసరికి ఈ శాతం పెరిగింది. పూర్తి విశ్లేషణ తర్వాత ఈ శాతం ఇంకా పెరగొచ్చని అంటున్నారు.
కరోనాతో ఎంపీ అశోక్‌గస్తి మృతి
బూత్ కార్యకర్త నుంచి ఒక్కసారిగా ఎంపీ స్థాయికి
జూన్‌లో ఎన్నిక.. పార్లమెంటుకు హాజరుకాకుండానే మృతి
కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తి (55) కరోనాతో గురువారం మృతిచెందారు. వైరస్ బారినపడిన ఆయన బెంగళూరులోని ఆస్పత్రిలో చేరారు. ఆయన మరణించినట్లు తొలుత వార్తలు వచ్చినా.. ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతున్నారని.. పలు అవయవాలు పనిచేయడం లేదని, ప్రాణాధార వ్యవస్థపై ఉన్నారని తెలిపాయి. చివరకు రాత్రి 10 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సరిహద్దులోని రాయ్‌చూర్‌కు చెందిన అశోక్ బీజేపీలో బూత్ స్థాయి కార్యకర్త. సీఎం యడ్యూరప్ప సూచించిన వారిని పక్కనపెట్టి మరీ.. నిబద్ధత ప్రాతిపదికన ఈ ఏడాది జూన్‌లో అధిష్ఠానం అనూహ్యంగా గస్తిని రాజ్యసభకు ఎంపిక చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు తొలిసారిగా ఆయన హాజరు కావాల్సి ఉంది. అంతలోనే మృతిచెందారు.