కృష్ణ జననం, సంజయుడ్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీజేఐ బాబ్డే
ABN , First Publish Date - 2020-08-12T21:44:15+05:30 IST
కృష్ణాష్టమి సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బాబ్డే కృష్ణుడ్ని, మహా భారతాన్ని

న్యూఢిల్లీ : కృష్ణాష్టమి సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బాబ్డే కృష్ణుడ్ని, మహా భారతాన్ని ఉటంకించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ఓ బెయిల్ పిటిషన్ విచారిస్తున్న సందర్భంలో ‘‘కృష్ణుడు జైళ్లో జన్మించింది ఈ రోజే కదా... మీకు బెయిల్ కావాలా? జైల్ కావాలా? అంటూ ప్రశ్నించాడు. దీంతో కేసును వాదిస్తున్న న్యాయవాది ... ‘‘మాకు బెయిలే కావాలి’’ అని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన సీజేఐ ...‘‘సరే... మత విశ్వాసాలపై మీకు అతిగా పట్టింపులు లేవేమో’’ అని సమాధానమిచ్చారు.
ఇక... మరో కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ‘మహాభారతాన్ని’’ ఉటంకించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల విషయంలో డా. కఫీల్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చా? దానిని ప్రత్యక్ష హాజరుగా పరిగణిస్తారా? అని న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రశ్నించగా.... ‘‘మహా భారత కాలం నుంచే వర్చువల్ హియరింగ్స్ అనే వ్యవస్థ ఉంది. మహా భారతంలో ‘‘సంజయ ఉవాచ’’ అని ఉంది కదా.. ’’ అని సీజేఐ బాబ్డే పేర్కొన్నారు.