కేంద్రం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలపై ఒమర్ మండిపాటు
ABN , First Publish Date - 2020-04-01T22:16:51+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ స్థానికతపై కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా

శ్రీనగర్ : కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ స్థానికతపై కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఈ చట్టంలో ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతిచ్చే నేతలు కూడా దీనిని విమర్శిస్తున్నారు’ అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇది వరకు కేంద్రం హామీ ఇచ్చిన అంశాలేవీ ఆ కొత్త చట్టంలో లేవని, ఇది ప్రజల మనస్సును గాయపరిచే విధంగా ఉందని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, దేశ ప్రజలందరి చూపూ అటు వైపుంటే, ఈ సమయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను తెచ్చిందని, ఈ సమయంలో ఎందుకు తెచ్చారో అనుమానించాల్సి వస్తోందని ఒమర్ విమర్శించారు.
కశ్మీర్ స్థానికతపై, ఉద్యోగ అర్హతలపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. కశ్మీర్లోని స్థానికత నిబంధనలతో పాటు ఉద్యోగ అర్హతలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా సరికొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై ఈ మార్గదర్శకాల కిందికి వచ్చే వారే అక్కడి స్థానిక ఉద్యోగాలకు పూర్తి అర్హులని కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్లో నిరాటంకంగా 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలని, లేదా ఏడు సంవత్సరాల పాటు జమ్మూకశ్మీర్లోనే విద్యనభ్యసించిన వారు, పదో తరగతి, ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్న వారిని స్థిర నివాసులుగా పరిగణించబడతారు. అయితే ఈ కొత్త మార్గదర్శకాలు 25,500 రూపాయల ప్రాథమిక వేతనం ఉన్న అన్ని పోస్టుల నియామకాలకూ ఈ నివాస నియమం వర్తిస్తుందని తెలిపారు.