లాక్‌డౌన్‌లో రాంబో సర్కస్ ఆగమాగం
ABN , First Publish Date - 2020-04-07T12:21:57+05:30 IST
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశంలో అతిపెద్ద సర్కస్‌లలో ఒకటైన రాంబో సర్కస్ కు చెడ్డ రోజులు దాపురించాయి. నవీ ముంబైలోని ఏరోలి వద్ద సర్కస్ కార్మికులు చిక్కుకుపోయారు. దేశంలో ....

ముంబై: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశంలో అతిపెద్ద సర్కస్‌లలో ఒకటైన రాంబో సర్కస్‌కు చెడ్డ రోజులు దాపురించాయి. నవీ ముంబైలోని ఏరోలి వద్ద సర్కస్ కార్మికులు చిక్కుకుపోయారు. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా సర్కస్ ను మూసివేశారు. రాంబో సర్కస్ మార్చి 6 న నవీ ముంబైలోని ఏరోలికి వచ్చింది. కొద్ది రోజులు షోలు బాగానే సాగాయి. మార్చి 13 న కోవిడ్ -19 మహమ్మారి ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రదర్శనలను రద్దు చేయాలని అధికారులు సర్కస్ నిర్వాహకులకు తెలిపారు. సర్కస్‌లో 90 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 32 మంది మహిళా ఆర్టిస్టులు, 58 మంది పురుషులు ఉన్నారు. సర్కస్‌లో 21 జంతువులు ఉన్నాయి. సర్కస్ నిర్వాహకులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రేషన్ కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు. సర్కస్ లో జోకర్ గా పనిచేస్తున్న బిజు పుష్కరన్ మీడియాతో మాట్లాడుతూ మా దగ్గరున్న రేషన్ వారం క్రితమే అయిపొయింది. అప్పటి నుండి తాము స్థానికులు, ఏరోలి మునిసిపల్ అధికారుల సహాయం తీసుకోవలసి వస్తోందని వాపోయారు. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డబ్బు పంపించలేకపోతున్నామని అన్నారు. జంతువులకు మునుపటిలాగే ఎలాగోలా తిండి పెడుతున్నామని తెలిపారు.