ప్రశ్నోత్తరాల రద్దు.. తొలి సారి కాదు!

ABN , First Publish Date - 2020-09-06T07:19:29+05:30 IST

పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాలను నిలిపివేయడం ఇది మొదటి సారి కాదని, ఇప్పటికే ఆరు సార్లు వివిధ కారణాలతో రద్దు చేశారని రాజ్యసభ అధికారులు తెలిపారు.

ప్రశ్నోత్తరాల రద్దు.. తొలి సారి కాదు!

గతంలో ఆరుసార్లు ఇలా నిలిపివేశారు

రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యకు అధికారుల నివేదిక


న్యూఢిల్లీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాలను నిలిపివేయడం ఇది మొదటి సారి కాదని, ఇప్పటికే ఆరు సార్లు వివిధ కారణాలతో రద్దు చేశారని రాజ్యసభ అధికారులు తెలిపారు. 1962, 1975, 1976, 1991, 2004, 2009 సంవ త్సరాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారని వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రశ్నోత్తరాలను అనుమతించలేదని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల రద్దుపై పాత వివరాలు సమర్పించాల్సిందిగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆదేశించగా, రాజ్యసభ సచివాలయ పరిశోధన విభాగం ఆయనకు నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉభయ సభాధ్యక్షులకు లేఖ రాసిందని, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రశ్నోత్తరాల సమయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొందని అధికారులు తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ రోజుకు 4 గంటలే భేటీ కానున్నాయని, ప్రశ్నోత్తరాలకే గంట కేటాయిస్తే ప్రజోపయోగ అంశాలు, కీలకమైన బిల్లులు, ఆర్జినెన్స్‌లపై చర్చించే అవకాశం ఉండదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.


పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయాన్ని నిలిపివేయడాన్ని విమర్శిస్తున్న వారు.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రశ్నోత్తరాలను నిలిపివేసిన  విషయాన్ని ఎత్తి చూపారు. పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌సహా అత్యధిక రాష్ట్రాల్లో సమావేశాలను కుదించి, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తి వేశారని వివరించారు. కాగా, ప్రశ్నోత్తరాల సమయం రద్దుకు 267 నిబంధన కింద ప్రతిపక్షాలే పలు సార్లు నోటీసులిచ్చాయని అధికారులు గుర్తు చేశారు. 

Updated Date - 2020-09-06T07:19:29+05:30 IST