హోం క్వారంటైన్‌లో వలస కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2020-05-29T14:15:58+05:30 IST
హోంక్వారంటైన్‌లో ఉన్న వలసకార్మికుడు మరణించిన విషాద ఘటన...

భువనేశ్వర్ (ఒడిశా): హోంక్వారంటైన్‌లో ఉన్న వలసకార్మికుడు మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో వెలుగుచూసింది. మయూర్‌భంజ్ జిల్లా నహాందషోలా పంచాయితీ పరిధిలోని భాలుబసా గ్రామానికి చెందిన పరేష్ చంద్ర మహంత గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని హోటల్ లో వంటవాడిగా పనిచేసేవాడు. లాక్ డౌన్ వల్ల సూరత్ లో హోటల్ మూతపడటంతో పరేష్ చంద్ర తన స్వగ్రామమైన భాలుబసా గ్రామానికి తిరిగివచ్చాడు. పరేష్ చంద్ర కరోనా హాట్ స్పాట్ అయిన సూరత్ నుంచి తిరిగి రావడంతో అతన్ని గరుడబసా గ్రామంలోని ఆదర్శవిద్యాలయలో క్వారంటైన్ కు తరలించారు. 7 రోజుల క్వారంటైన్ అనంతరం పరేష్ చంద్రను హోంక్వారంటైన్ చేశారు. హోం క్వారంటైన్ లో ఉన్న తన భర్త మృతదేహమై కనిపించాడని మృతుడు పరేష్ చంద్ర భార్య సొంబరి ఆవేదనగా చెప్పారు. తన భర్తకు కరోనా ఉందని గ్రామస్థులు తమను దూరంగా ఉంచారని, తన భర్త క్వారంటైన్ లో ఉండగానే మరణించాడని సొంబరి విలపిస్తూ చెప్పారు.