మహారాష్ట్ర బీజేపీకి ఓబీసీ నేతలు గట్టి ఝలక్ ఇవ్వబోతున్నారా?

ABN , First Publish Date - 2020-10-14T22:30:08+05:30 IST

సీనియర్ నేతల మధ్య విభేదాలు మహారాష్ట్ర బీజేపీకి తలనొప్పిగా మారాయి. 2019లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కొందరి ఓటమికి మరికొందరు

మహారాష్ట్ర బీజేపీకి ఓబీసీ నేతలు గట్టి ఝలక్ ఇవ్వబోతున్నారా?

ముంబై : సీనియర్ నేతల మధ్య విభేదాలు మహారాష్ట్ర బీజేపీకి తలనొప్పిగా మారాయి. 2019లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కొందరి ఓటమికి మరికొందరు పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు చేస్తున్న ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీ) నేతలు త్వరలో బీజేపీ నుంచి అధికార కూటమిలోని ఎన్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


సీనియర్ బీజేపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సే తన మద్దతుదారులతో కలిసి త్వరలోనే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


ఏక్‌నాథ్ ఖడ్సేకు 2019 మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె రోహిణి ఖడ్సే పోటీ చేసి, పరాజయం చవి చూశారు. దీంతో ఆయన పార్టీకి మరింత దూరమయ్యారు. 


మరోవైపు మాజీ మంత్రులు పంకజ ముండే, ప్రకాశ్ మెహతా, మరికొందరు ఓబీసీ నేతలు పార్టీ సీనియర్ నేతల వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటమికి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు రాకపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంకజ ముండే, రోహిణి పరాజయం పాలవడానికి కారణం దేవేంద్ర ఫడ్నవీస్ అని ఏక్‌నాథ్ ఖడ్సే ఆరోపిస్తున్నారు. తన రాజకీయ జీవితాన్ని అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. తనకు శత్రువులయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ భావిస్తే, వారిని పక్కనబెడుతున్నారని ఏక్‌నాథ్ ఖడ్సే అంటున్నారు. 


Updated Date - 2020-10-14T22:30:08+05:30 IST