దేశంలో మరోటి.. 9కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య

ABN , First Publish Date - 2020-03-24T03:26:05+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి బారినపడి దేశంలో మరో వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య

దేశంలో మరోటి.. 9కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి బారినపడి దేశంలో మరో వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన నిర్ధారిత కేసుల సంఖ్య 468కి పెరిగింది. ఇందులో 424 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే 97 కేసులు నమోదు కావడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం తొలి కరోనా మరణం నమోదైంది. ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన 69 ఏళ్ల టిబెటెన్ టెంజిన్ చాపెల్ కోరోనా వైరస్‌‌తో మృతి చెందినట్టు వైద్యాధికారులు తెలిపారు.  


కంగ్రా జిల్లాలోని టండా పట్టణంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంతకుముందు అతడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హెల్త్) ఆర్‌డీ ధిమన్ తెలిపారు. ఈ ఉదయమే అతడు ఆసుపత్రిలో చేరాడని, మృతి చెందిన తర్వాత అతడి నమూనాలు పరీక్షంగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని వివరించారు.  


టెంజిన్ ఈ నెల 15న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఢిల్లీలో కొన్ని రోజులు గడిపిన తర్వాత 21న  టిబెటన్ల ఆధ్యాత్మిక గురువైన దలైలామా నివాసం అయిన మెక్ లియోడ్‌గంజ్‌కు కారులో వెళ్లినట్టు అధికారులు తెలిపారు. నేడు (సోమవారం) కరోనాతో మరొకరు కూడా మృతి చెందారు. కోల్‌కతాలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని డమ్‌డమ్‌కు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి గతవారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. తాజాగా అతడు ప్రాణాలు విడిచాడు. ఇది దేశంలో ఎనిమిదో మరణం కాగా, టెంజిన్ చాపెల్ మృతితో మరణాల సంఖ్య 9కి చేరింది.  

Updated Date - 2020-03-24T03:26:05+05:30 IST